Save The Tigers 3 | టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహి వి రాఘవ్ క్రియేటివ్ విజన్‌తో తెరకెక్కిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌కు టాలీవుడ్ ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే రెండు సీజన్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఈ టైగర్స్ టీమ్.. మూడో సీజన్‌తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు జియో హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ త్రయం లీడ్ రోల్స్‌లో శ్రీరామ్ ఎరగం దర్శకత్వంలో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ 3’ ఎలా ఉందో చూద్దాం.
కథ:
గంటా రవి, రాహుల్, విక్రమ్ ఓ పబ్ దగ్గర వెయిట్ చేస్తూ తమను పోలిన మరో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. ఒకే పోలికలతో ఉన్న ఈ ఆరుగురికి సంబంధం ఏంటనేది అసలు ట్విస్ట్. ఈ లోకంలో రవి ఎమ్మెల్యే టికెట్ మోజులో డబ్బులు పోగొట్టుకుని భార్య హైమా పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు. రచయిత రాహుల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ పోగొట్టుకుని మాధురి దగ్గరకు హైదరాబాద్ వస్తాడు. విక్రమ్‌కు భార్య రేఖ విడాకులు ఇవ్వాలని పట్టుబడుతుంది. పెళ్లి, సంసారం మీద ఫ్రస్ట్రేషన్‌తో ఈ ముగ్గురూ స్వర్గంలో ఇంద్రుడిని తిడతారు. వీరి బాధ చూసిన ఇంద్రుడు గుప్తాను పంపిస్తాడు. గుప్తా ఏడు లోకాలను పరిశీలించి, మొదటి లోకంలో కష్టాలు పడుతున్న రవి, రాహుల్, విక్రమ్‌లను.. అన్ని సుఖాలు అనుభవిస్తున్న రెండో లోకంలోని వారితో స్వాప్(పాత్రలను మార్చాడం) చేస్తాడు. దాంతో అసలు కథ మొదలవుతుంది. ఆ లోకానికి ఈ ముగ్గురు వెళ్తే ఏమైంది? ఈ లోకానికి వచ్చిన ఆ ముగ్గురు ఎలాంటి గందరగోళం సృష్టించారు? చివరికి ఎవరు ఏ లోకంలో సెటిల్ అయ్యారు? అనేది మిగతా కథ.
ఎలా ఉంది:
రెండు లోకాలు, రెండు భిన్న మనస్తత్వాలు, బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్‌తో ‘సేవ్ ది టైగర్స్ 3’ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడిని, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ తరహా ఏడు లోకాల పాయింట్‌ను తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఎరగం కొత్తగా ప్రెజెంట్ చేశాడు. మొదటి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికి సరిపోగా, మూడో ఎపిసోడ్ నుంచి అసలు ఫన్ మొదలవుతుంది. నాలుగు, ఐదు ఎపిసోడ్స్‌లో రెండు లోకాల కాంట్రాస్ట్‌తో నవ్వులు పీక్స్‌కు వెళ్తాయి. ఈ లోకంలో ఇండిపెండెంట్‌గా ఉండే భార్యలు ఆ లోకంలో బానిసల్లా, ఈ లోకంలో సాఫ్ట్‌గా ఉండే భర్తలు ఆ లోకంలో శాడిస్టులుగా కనిపించడం ఆసక్తికరం. ప్రతి పాత్రకు రెండు వేరియేషన్స్ చూపించే ఛాన్స్ దొరికింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌లో ఇరగదీశారు. రోహిణి మాత్రం క్లైమాక్స్‌ను హైజాక్ చేసింది. ఆమె ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌కు ఓటీటీలో అయితే విజిల్స్ పడతాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా, గుండు సుదర్శన్ గుప్తాగా, గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్ధన్, అభయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్‌గా అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫన్ను, ఎమోషన్‌ను క్యారీ చేసింది. కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ క్రిస్ప్‌గా సాగింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బోల్డ్‌గా ఉన్నా, ఓటీటీ కంటెంట్ కాబట్టి ఓకే అనిపిస్తుంది. పేరెంటింగ్, భార్యాభర్తల బంధం, మహిళా సాధికారతపై అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్: కాన్సెప్ట్, ప్రియదర్శి-అభినవ్-చైతన్య టైమింగ్, రోహిణి కామెడీ, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్ర, క్లీన్ ఎంటర్టైన్మెంట్
మైనస్ పాయింట్స్: మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త స్లో, కొన్ని బోల్డ్ డైలాగ్స్
చివరిగా: ‘సేవ్ ది టైగర్స్ 3’ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసే పక్కా ఎంటర్టైనర్. అసభ్యత, అశ్లీలత లేకుండా క్లీన్ కామెడీతో హ్యాట్రిక్ కొట్టేశారు.
రేటింగ్: 3.5/5