సినిమా పేరు: సర్దార్ 2
తారాగణం: కార్తీ, ఎస్.జె.సూర్య, అషికా రంగనాథ్, మాళవిక మోహనన్..
దర్శకత్వం: పీఎస్ మిత్రన్
నిర్మాతలు: ఎస్.లక్ష్మణ్‌కుమార్, ఇషాన్ సక్సేనా..
కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా తమిళంతో పాటు తెలుగులోనే పెద్ద హిట్. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే సినిమాపై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టే ప్రచార చిత్రాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి ‘సర్దార్’ స్థాయిలో ఈ ‘సర్దార్ 2’ ఆకట్టుకున్నదా? కార్తీకి ఖాతాలో హిట్ పడ్డట్టేనా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టగలిగే ఓ వైరల్ వెపన్నీ, దాని విరుగుడునీ జపాన్ కనుగొంటుంది. దాని ద్వారా ప్రపంచాన్నే శాశించాలనేది జపాన్ కుట్ర. ఆ కుట్రను భగ్నం చేసే బాధ్యతను ఇండియన్ గవర్నమెంట్ ఓ ‘రా’ టీమ్‌కి అప్పజెబుతుంది. ఆ టీమ్‌లోని రా ఏజెంట్లలో సర్దార్(కార్తీ) ఒకడు. జపాన్ నుంచి ఆ వైరల్ వెపన్‌ని ఇండియాకు తరలించే ప్రయత్నం చేస్తుంటుంది జపాన్. ఆ వైరల్ వెపన్‌ని ఇండియా దాకా రానివ్వకుండా మధ్యలోనే హిందూ మహాసముద్రంలో పడేయాలనేది ‘రా ఏజెంట్ల’ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా సర్దార్ చేసే చిన్న తప్పు వల్ల ఆ వైరల్ వెపన్లోని కొంతభాగం ఇండియాలోని ఓ ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. దాంతో సర్దార్ దేశం దృష్టిలో ఓ ద్రోహిలా మిగిలిపోతాడు. మిగిలిన భాగాన్ని ‘రా ఏజెంట్స్’ ఓ ప్రాంతంలో భద్ర పరుస్తారు. 35ఏండ్ల తర్వాత ఇండియాలో ఎవరికీ తెలియని ఓ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న ఆ ‘వైరల్ వెపన్’ కోసం బ్లాక్ డగ్గర్(ఎస్.జె.సూర్య) అనే అండర్‌వరల్డ్ డాన్ ప్రయత్నాలు చేయడం మొలుపెడతాడు. అసలు ఈ బ్లాక్ డగ్గర్ ఎవరు? ఆ వైరల్ వెపన్‌ని నిర్వీర్యం చేసే క్రమంలో సర్దార్ చేసిన తప్పేంటి? ఆ వైరల్ వెపన్‌ని బ్లాక్ డగ్గర్ చేతికి చిక్కకుండా సర్దార్ ఎలా కాపాడాడు? అనేదే ఈ సినిమా కథ
విశ్లేషణ
ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఎన్టీఆర్ ‘చిక్కడు దొరకడు’ సినిమాలో మూడు హారాల ఫార్ములాను ఇందులో మూడు కత్తుల ఫార్ములాలా వాడేశాడు దర్శకుడు మిత్రన్. ఆ మూడు కత్తులతో మాత్రమే ఆ వెపన్‌ని దాచి ఉన్న యంత్రాన్ని ఓపెన్ చేయవచ్చు. ఆ మూడు కత్తులు మూడు ప్రాంతాల్లో ఉంటాయి. దాన్ని దక్కించుకునే క్రమంలో హీరోలు, విలన్ల ఎత్తులు పైఎత్తులే ఈ సినిమా కథనం. సినిమా ఆద్యంతం యాక్షన్ మోడ్‌లో సాగింది. ఎమోషన్స్ కరువయ్యాయి. ‘సర్దార్’లో ఉన్న ఎమోషన్ ‘సర్దార్ 2’ కనిపించదు. అయితే.. ‘సర్దార్’ కంటే భారీగా సినిమాను తీశారు. సినిమా అంతా సీరియస్ మోడ్‌లో కన్ఫ్యూజన్గా సాగుతుంది. సగటు ప్రేక్షకుడికి అర్థం కావడం కష్టమే. అయితే.. ఈ కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. జనం వాడుతున్న మెడిసన్స్, తింటున్న చికెన్, కూరగాయలు.. నిత్యవసర వస్తువుల్లో యాంటీబయాటిక్స్ ఎలా కలుస్తున్నాయో, ప్రజల ఆరోగ్యం ఎలా దిగజారుతున్నదో ఓ సన్నివేశం ద్వారా బాగా విశరపరిచాడు దర్శకుడు మిత్రన్. సినిమాలో ఉన్న యాక్షన్, తండ్రీకొడుకులుగా కార్తీ అభినయం ఆడియన్స్‌కి నచ్చొచ్చు. అయితే.. ప్రతి పాత్రకూ ఈ కథలో ప్రాధాన్యత ఉండటం నిజంగా అభినందించదగ్గ విషయం. చివరకు యోగిబాబు పాత్ర కూడా కథలో భాగమే. హీరోయిన్లని కేవలం గ్లామర్‌కే వాడకుండా సంఘర్షణాత్మకంగా వారి పాత్రలను నడిపించారు మిత్రన్. ప్రథమార్ధం మీద ద్వితీయార్ధం సినిమా బావుంది.
నటీనటులు
తండ్రీకొడుకులుగా కార్తీ చక్కగా నటించాడు. రెండు పాత్రల్లో చక్కటి వ్యత్యాసాన్ని చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే బాగా కష్టపడ్డాడు. ఇక హీరోయిన్లు అషికా రంగనాథ్, మళవిక మోహనన్లది అభినయానికి ఆస్కారమున్న పాత్రలు. కార్తీ చెప్పినట్టుగా ఇందులో హీరోయిన్లు డ్యాన్సులు చేయరు. యుద్ధాలు చేస్తారు. ఇద్దరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో హైలైట్ ఎస్.జె.సూర్య. తన విలనీతో అదరగొట్టాడు. ఓ వైపు విలనీ పండిస్తూ, సమాజానికి అద్భుతమైన సందేశం కూడా ఇచ్చాడు. ద్వితీయార్ధంలో వచ్చే ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఇక మిగతా నటీనటులంతా పరిధిమేర తమ పాత్రలను రక్తి కట్టించారు.
సాంకేతికంగా
కథ, కథనం విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేదో అనిపించింది. ‘రా’ ఇన్విస్టిగేషన్కి చెందిన కొన్ని శాస్త్రీయ నామాలు సామాన్య ప్రజలకు అర్థం కావు. వాటిని అర్థమయ్యేలా దర్శకుడు జాగ్రత్త పడితే బావుండేది. కెమెరా, నేపథ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పని ఉందేమో అనిపిస్తుంది. మొత్తంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ‘సర్దార్ 2’ నచ్చొచ్చు.
బలాలు
కార్తీ, ఎస్.జె.సూర్య నటన, కొన్ని సన్నివేశాలు…
బలహీనతలు
కన్ఫ్యూజన్తో సాగే కథనం, సినిమా కాస్త స్లోగా సాగడం..
రేటింగ్ : 2.5/5