Saptagiri | టాలీవుడ్లో సెలబ్రిటీల వ్యాఖ్యలు కొన్నిసార్లు అనుకోని వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడుమారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ సినిమాను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చలకు కారణమయ్యాయి.తన తాజా చిత్రం పురుష ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన సప్తగిరి, ఈ మధ్యకాలంలో తాను చేసిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాల గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంలో కొన్ని సినిమాల పేర్లు చెబుతూ మాట్లాడిన ఆయన, పొరపాటున ది రాజా సాబ్ పేరును కూడా అదే జాబితాలో ప్రస్తావించాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాన్ని చిన్న సినిమాగా ఎలా పేర్కొంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి.
వివాదం మరింత పెద్దది కావడంతో దర్శకుడు మారుతి స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయన సప్తగిరితో మాట్లాడి విషయం తీవ్రతను వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం తన వ్యాఖ్యలపై స్పందించిన సప్తగిరి, అది పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమేనని స్పష్టం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన సప్తగిరి, “లో-బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఫ్లోలో ది రాజా సాబ్ పేరు వచ్చేసింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను” అని తెలిపారు. అలాగే ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు కూడా చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉండగా, సప్తగిరి సినీ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత “సప్తగిరి”గా తన పేరు మార్చుకున్నారు. తొలుత సహాయ దర్శకుడిగా పని చేసి, ఆ తర్వాత నటుడిగా మారి ప్రత్యేక గుర్తింపు పొందారు.ముఖ్యంగా ప్రేమకథా చిత్రమ్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలతో కామెడీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి వంటి సినిమాలతో హీరోగానూ ప్రేక్షకులను అలరించారు.ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో నటించిన పురుష సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.