Suriya | యథార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం ‘రక్త చరిత్ర 2’ రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఆధారంగా పరిటాల రవి, మద్దెలచెరువు సూరిల కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
ఇటీవల ‘రక్త చరిత్ర 1’ రీ-రిలీజ్ అయి హౌస్ఫుల్ కలెక్షన్లతో మంచి విజయం సాధించడంతో, నేటితరం ప్రేక్షకులకు కూడా ఈ వాస్తవిక చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ‘రక్త చరిత్ర 2’ ను ఆగష్టు 1న థియేటర్లలో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను యూనిట్ విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్టైన్మెంట్స్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై వంకాయపాటి మురళీకృష్ణ, నట్టి లక్ష్మి కరుణ, నట్టి క్రాంతిలు ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ టేకింగ్, నటీనటుల ప్రదర్శన, నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలి భాగం లాగే ‘రక్త చరిత్ర 2’ కూడా రీ-రిలీజ్ లో పెద్ద హిట్ సాధిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.