Rakasa | యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాకాస థియేటర్లలో మంచి స్పందనను అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ప్రీమియర్స్‌తో కలిపి ‘రాకాస’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో మాత్రమే రూ.2.60 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు థియేటర్లలో 36 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమాకు వస్తున్న స్పందనపై నిర్మాత నిహారిక కొణిదెల ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది అని తెలిపారు. ఇటీవల మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించి విజయోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సంగీత్ శోభన్, నయన్ సారికతో పాటు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
గ్రామంలో ఉన్న ఓ పాడుబడిన కోటలో వందల ఏళ్లకు ఒకసారి మేల్కొనే రాక్షసుడు కథకు కేంద్రబిందువుగా ఉంటుంది. గ్రామస్తులు నమ్మే ఆచారం ప్రకారం… ఆ రాక్షసుడికి బలి ఇస్తే గ్రామం క్షేమంగా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో హీరో వీరు (సంగీత్ శోభన్)ను కోటలోకి పంపే పరిస్థితి వస్తుంది. అతను ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అతని స్నేహితులు ఎలా సహాయపడతారు? అన్నది కథలో ఆసక్తికరంగా మలిచారు. రాకాస చిత్రం హారర్ – కామెడీ మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ డే నుంచే మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా… వీకెండ్లో మరింత జోరు చూపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.