Rajini- Kamal |దక్షిణాదిలో మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్శ్వ, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటించబోతున్న మల్టీస్టారర్ సినిమా. ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సినీ వర్గాల్లో ప్రచారం ప్రకారం ఈ సినిమాకు సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది.
ఈ భారీ వ్యయంలో ఎక్కువ భాగం ప్రధాన నటులు మరియు సాంకేతిక బృందం పారితోషికాలకే వెళ్తున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఒకే సినిమాలో నటించడం వల్ల వారి పారితోషికాలు కూడా అత్యంత భారీగా ఉన్నాయని సమాచారం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తన విజయాల నేపథ్యంలో మంచి మొత్తాన్ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ రవిచందర్ కాగా, ఆయన సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం కానుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం ముందస్తు పనులు వేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌ను దర్శకుడు నెల్సన్ ఎలా రూపొందిస్తాడో అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి రజినీకాంత్ – కమల్ హాసన్ కలయిక, నెల్సన్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం కలిసివచ్చి ఈ సినిమాను భారతీయ సినీ రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.