రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ హిట్ ఫిల్మ్ ‘జోసెఫ్’కు రీమేక్‌గా దర్శకురాలు జీవిత రాజశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఆత్మీన్ రాజన్ నాయికగా నటిస్తున్నది. శివానీ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ…‘మా సినిమాకు ప్రతి ఒక్క ప్రేక్షకుడూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. కోవిడ్ టైమ్‌లో సినిమా నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ సమయంలో అంతా సహకరించారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, నటుడు సమీర్ తదితరులు పాల్గొన్నారు.
మేము ఎలాంటి తప్పు చేయలేదు: ‘గరుడవేగ’ చిత్రానికి సంబంధించిన చెక్‌బౌన్స్ కేసుపై జీవిత రాజశేఖర్ స్పందించారు. ‘గరుడవేగ’ సినిమా కోసం జీవిత, రాజశేఖర్ తమ వద్ద 26కోట్లు అప్పుగా తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారని జోస్టార్స్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కోటేశ్వరరాజు, హేమ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జీవిత మాట్లాడుతూ ‘కేసుకు సంబంధించి రెండు నెలల క్రితమే నాకు వారంట్ వచ్చింది. కోటేశ్వరరాజు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు.ప్రస్తుతం నగరి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను’ అని జీవిత పేర్కొంది.