Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇది 22వ చిత్రం కావడం విశేషం. షారూఖ్ ఖాన్‌తో ‘జవాన్’ తీసాక అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రాకా’ అనే పదం వినగానే చాలా మందికి కొత్తగా అనిపిస్తోంది. సాధారణంగా ఫినిష్ (Finnish) భాషలో ‘రాకా’ అంటే ‘రా’ లేదా ‘బ్రూటల్’ అనే అర్థం వస్తుంది. అంటే ఎలాంటి మెరుగు లేకుండా, అసలు స్వరూపంలో ఉండే శక్తిని సూచించే పదంగా దీనిని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి సినిమాలో హీరో పాత్ర చాలా రఫ్, పవర్‌ఫుల్‌గా ఉండే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. నుదిటిపై గాయాలు, కళ్లలో ఆగ్రహం, గుండు తల, నెరిసిన గడ్డంతో బన్నీ యుద్ధంలో గాయపడిన యోధుడిలా కనిపించాడు. తోడేలు ఆకారంలో చూపించిన విజువల్ ఎలిమెంట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఒక రా ఫోర్స్‌ను ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు. కామిక్ బుక్స్ ప్రపంచంలో కూడా ‘రాకా’ అనే పేరు ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా హిందీ కామిక్స్‌లో ‘చాచా చౌదరి’ కథల్లో కనిపించే ‘రాకా’ అనే డెకాయిట్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయుర్వేద ఔషధం వల్ల చిరంజీవిగా మారే ఆ పాత్రతో పోల్చుతూ, ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ పాత్రకు అలాంటి ఇమ్మోర్టల్ ఎలిమెంట్ ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు.
హాలీవుడ్‌లోని X-Men సిరీస్ చూసిన వారికి వోల్ఫ్ మ్యాన్ కాన్సెప్ట్ పరిచయమే. అలాగే విక్రమ్ నటించిన I సినిమాలో కూడా ఇలాంటి లుక్ కనిపించింది. ఇప్పుడు ‘రాకా’ పోస్టర్లో బన్నీని చూస్తే మనిషి నుంచి తోడేలుగా మారే కాన్సెప్ట్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న కారణం, కథలోని మలుపులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. హిందీ క్లాసిక్ చిత్రం ‘జిస్ దేశ్ మే గంగా బెహతి హై’లో విలన్ పేరు కూడా ‘రాకా’నే. అందువల్ల హిందీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తది కాదు. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ టైటిల్ కొత్తగా అనిపిస్తోంది. ఏదేమైన ‘రాకా’ అనే టైటిల్ చుట్టూ ఇప్పటికే ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ లుక్, అట్లీ దర్శకత్వం, భారీ బడ్జెట్ అన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కథలో ‘రాకా’ అనే పేరు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.