Purusha | ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం వచ్చిన చిన్న సినిమాలలో ఒకటి ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
గోవింద్ (పవన్ కళ్యాణ్), శ్రీను (కసిరెడ్డి), సత్తి బాబు (సప్తగిరి), క్రియేటివ్ కిస్సు అలియాస్ కిషోర్ (వెన్నెల కిషోర్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఇందులో గోవింద్ ఒక సైకాలజిస్ట్. ఇతరుల భార్యాభర్తల సమస్యలను పరిష్కరిస్తూ, వారికి కౌన్సిలింగ్ ఇచ్చే గోవింద్‌కే స్వయంగా విడాకుల పరిస్థితి ఎదురవుతుంది. అతని భార్య కమల (రాయంచ) అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు శ్రీను భార్య గీత (విషిక), సత్తి బాబు భార్య లక్ష్మీ (హాసిని సుధీర్) కూడా పెళ్లైన ఏడాదికే తమ భర్తలకు విడాకులు ఇవ్వాలని కోర్టు మెట్లెక్కుతారు. అసలు ఈ మూడు జంటల మధ్య తలెత్తిన మనస్పర్థలు ఏంటి? ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యలు ఎందుకు విడాకులు కోరుకుంటారు? ఈ ముగ్గురి స్నేహితుడైన క్రియేటివ్ కిస్సు పాత్ర ఈ గొడవలకు ఎలా కారణమైంది? చివరికి ఈ జంటలు తమ సమస్యలను అధిగమించి ఎలా ఒకటయ్యాయి? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
భార్యాభర్తల మధ్య వచ్చే గిల్లికజ్జాలు, అపార్థాల చుట్టూ సాగే కుటుంబ కథా చిత్రాలు ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. దర్శకుడు వీరు వులవల ఈ పాత కాన్సెప్ట్‌కే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా చక్కని ఎంటర్టైన్మెంట్ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. సినిమా ప్రారంభంలో మూడు జంటల పరిచయం, వారి మధ్య ఉన్న దూరాన్ని చూపించిన తీరు బాగుంది. కోర్టు వాయిదాలు, జడ్జ్ ముందు ఒక్కొక్కరి ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ కావడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయిస్తుంది. ఓ చక్కని ఎమోషనల్ టచ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ద్వితీయార్ధంలో హీరో తొలిప్రేమ, రోజితో సాగే లవ్ ట్రాక్ వింటేజ్ మూడ్‌ను గుర్తుకు తెస్తుంది. కసిరెడ్డి జంపింగ్ డైలాగ్స్ ప్రతీ చోటా పేలాయి. ‘హౌస్ హస్బెండ్’ కాన్సెప్ట్ చుట్టూ పమ్మి సాయి పాత్రతో డిజైన్ చేసిన ఎపిసోడ్స్ ఆద్యంతం నవ్విస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే చిన్న ట్విస్ట్, భార్యాభర్తల బంధం గురించి చెప్పిన తీరు హృదయాన్ని హత్తుకుంటుంది.
నటీనటుల ప్రతిభ:
హీరోగా పవన్ కళ్యాణ్‌కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ, ఎక్కడా బెరుకు లేకుండా చక్కగా మేనేజ్ చేశాడు. యాక్షన్, డ్యాన్స్, లవ్ సీన్స్‌లో మెప్పించాడు. నటన పరంగా అక్కడక్కడా కొంత అనుభవరాహిత్యం కనిపించినా, తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేశాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ జోడి సినిమా ఆద్యంతం తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రాజీవ్ కనకాల, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి తమ పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు. హీరోయిన్లుగా నటించిన రాయంచ, విషిక, హాసిని తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా సినిమా క్వాలిటీగా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగినట్టుగా కుదిరాయి. పాటలు తెరపై చూడటానికి బాగున్నాయి. కసిరెడ్డి కోసం రాసిన పంచ్ డైలాగ్స్, భార్యాభర్తల బంధంపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. కొత్త నిర్మాతే అయినప్పటికీ బత్తుల కోటేశ్వరరావు ఎక్కడా రాజీ పడకుండా, నిర్మాణ విలువల విషయంలో ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ ప్రొడక్ట్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్:
వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి కామెడీ
క్లైమాక్స్ ఎమోషన్స్
ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే అంశాలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
ఊహకందే రెగ్యులర్ కథ, కథనం
సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సీన్లు
ముగింపు:
రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామానే అయినప్పటికీ, కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు ‘పురుష:’ చిత్రాన్ని ఆకట్టుకునేలా మలిచారు. ఎలాంటి అశ్లీలత లేకుండా, కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకుంటూ చూసేందుకు ఈ వారాంతంలో ‘పురుష:’ ఒక మంచి ఆప్షన్.