Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సహ నటీనటుల సినిమాలకు ఎప్పుడూ అండగా నిలిచే డార్లింగ్.. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఆల్ఫా సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రభాస్ చేసిన ఈ చిన్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను పంచుకుంటూ.. ఆలియా భట్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాధారణంగా తనకు నచ్చిన సినిమాలు, తనతో సన్నిహితంగా ఉండే నటీనటుల చిత్రాలకు ప్రభాస్ ఇలా మద్దతు తెలుపుతుంటారు. కానీ ఈసారి ఆయన పోస్ట్‌కు మరో ప్రత్యేక కారణం ఉందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ప్రభాస్ పోస్ట్‌కు స్పందించిన ఆలియా భట్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “థ్యాంక్యూ… థ్యాంక్యూ… థ్యాంక్యూ సో మచ్” అంటూ ప్రభాస్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కొద్ది రోజుల నుండి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ సీక్వెల్లో ఆలియా భట్ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఆమె ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆలియా సినిమాకు ప్రత్యేకంగా మద్దతు తెలపడం, ఆమె కూడా వెంటనే స్పందించడం చూసిన నెటిజన్లు.. “ఇది ‘కల్కి 2’ కనెక్షనేనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆలియా భట్ ‘కల్కి 2’లో నటిస్తున్నారనే విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ కేవలం ప్రచారంగానే భావించాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ చిత్రాన్ని కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా డిసెంబర్ 2026లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఆల్ఫా’ సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించగా, అర్థరాత్రి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రీ-రిలీజ్ హైప్‌ను సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయంగా మార్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.