OG Universe Begins : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓజీ 2’ రానున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, తాజాగా ఆ సినిమా పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం గురువారం ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
#OGUniverse Begins అనే హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘గంభీర కథ సిద్ధమవుతోంది. తుపాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది’ అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో ఈ అప్డేట్ ఇచ్చారు. విడుదలైన వీడియోలో డైరెక్టర్ సుజీత్‌తో కలిసి పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్న విజువల్స్ ఉన్నాయి. చివర్లో పవన్ కళ్యాణ్ ‘నేను రెడీ’ అని చెప్పడం నెటిజన్లను, మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ‘ఓజీ 2’ షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని స్పష్టమవుతోంది. మొదటి భాగానికి సంగీత దర్శకుడిగా పని చేసిన థమన్ ఎస్ ఈ సీక్వెల్‌కు కూడా మ్యూజిక్ అందించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. ‘ఓజీ’ మొదటి భాగంలో చూపించిన పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌ను ఈ సీక్వెల్లో మరింత పెద్ద స్థాయిలో, కొత్త కోణంలో చూపించనున్నారని టాక్. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ‘ఓజీ 2’ కోసం డేట్స్ కేటాయించడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.