Varanasi | సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. ఈసారి మహేష్‌బాబుతో ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు అంశాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, తాజాగా ఇందులో ఓ కొత్త భాషను ఉపయోగించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.
రాజమౌళి సినిమాల్లో కథకు, పాత్రలకు, వాటి నేపథ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కథలో భాగంగా వచ్చే ప్రతి అంశాన్ని సహజంగా చూపించేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ‘వారణాసి’ చిత్రంలోనూ అలాంటి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ప్రత్యేకమైన భాష లేదా లిపిని రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, ప్రత్యేకమైన పాత్రలు కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి సన్నివేశాల్లో కొత్త భాషను ఉపయోగిస్తే కథకు మరింత ప్రత్యేకత వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ భాషకు సంబంధించిన వివరాలు, దాన్ని సినిమాలో ఎక్కడ ఉపయోగించనున్నారు అనే అంశాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాజమౌళి గతంలో ‘బాహుబలి’ చిత్రంలో కాళలకేయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిలికి భాషను పరిచయం చేశారు. ఆ భాషలోని పదాలు, పలికే విధానం, పాత్రల ప్రత్యేకత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కల్పిత ప్రపంచానికి మరింత సహజత్వం తీసుకురావడంలో ఆ ప్రయోగం తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వారణాసి’లోనూ అలాంటి ప్రయోగం జరిగితే మరోసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది. అయితే ‘బాహుబలి’లోని కిలికి భాష తరహాలోనే కొత్త భాషను రూపొందించారనే వార్తకు సంబంధించి చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక సమాచారం వెలువడితేనే ఈ ప్రచారంలో నిజానిజాలు తేలనున్నాయి.