Mohanlal | మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (MohanLal) తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘L367’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి ఈ సినిమా పూర్తిగా వార్ (యుద్ధం) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు విష్ణు మోహన్ (Vishnu Mohan) తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ (Gokulam Gopalan) శ్రీ గోకులం మూవీస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్‌తో పాటు అర్జున్ రాంపాల్, పార్తిబన్, ఆదిల్ హుస్సేన్, భాగ్యశ్రీ బోస్ వంటి భారీ తారగణం నటించబోతుంది.
కాగా.. ఈ చిత్రానికి టెక్నికల్ నిపుణులుగా గ్లోబల్ లెవెల్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం విశేషం. ప్రపంచస్థాయి యాక్షన్ మరియు విజువల్స్ అందించేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘పుష్ప’ చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా బ్రోజెర్ (Miroslaw Kuba Brozek) ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శాశ్వత్ సచ్దేవ్ (Shashwat Sachdev) ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ‘కిల్’, ‘వార్’ వంటి బాలీవుడ్, గ్లోబల్ యాక్షన్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ఓ సే-యెంగ్ (Oh Se-yeong) ఈ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేయబోతున్నాడు.