Michael Jackson | పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిచింది. ఇప్పటివరకు మ్యూజిక్ బయోపిక్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉన్న ‘బోహేమియన్ రాప్సోడి’ రికార్డును ఈ చిత్రం తాజాగా దాటేసింది.
హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ‘మైఖేల్’ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 911.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,673 కోట్లు) భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో గతంలో 910.9 మిలియన్ డాలర్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో అగ్రస్థానంలో ఉన్న ‘బోహేమియన్ రాప్సోడి’ని ఇది వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు 2022లో వచ్చిన ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ ‘ఎల్విస్’ రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించగా.. జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో నటించాడు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది.