రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. డీవై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ దర్శకుడు కె.దశరథ్, డీవై చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను వి.వి.వినాయక్, థీమ్ వీడియోను ఎమ్మెల్సీ ఎల్.రమణ విడుదల చేశారు. దశరథ్ మాట్లాడుతూ ‘నేను కథ తయారు చేస్తే ముగ్గురికి చెబుతాను. అందులో వినాయక్‌గారు ఒకరు. ఆయన ఇచ్చిన సూచనలతో అద్భుతమైన కథ సిద్ధం చేశాం.
ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్ మూవీగా అలరిస్తుంది’ అన్నారు. మారేడుమిల్లి, ఖమ్మం, నార్వే వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ చేశామని డీవై చౌదరి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ: కె.దశరథ్, కెమెరా: సాయిసంతోష్, సంగీతం: కె.వేద, దర్శకత్వం: డీవై చౌదరి.