JrNTR | టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో, ఆయనకు సంబంధించినట్లుగా చెబుతూ ‘RAW NTR’ అనే పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై మంగళవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘RAW NTR’ అనే సంస్థతో కానీ, వారి యాక్టివిటీస్‌తో కానీ శ్రీ ఎన్టీఆర్ గారికి లేదా ఆయన ఆఫీస్‌కు ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేవని స్పష్టం చేసింది.
ఆ సంస్థకు ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విషయాలు, అధికారిక ప్రకటనలు ఏవైనా సరే కేవలం ఎన్టీఆర్ గారి ద్వారా లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడతాయని పేర్కొంది. కాబట్టి అనధికారిక వ్యక్తులు, సంస్థలు చేసే ప్రచారాలను, ప్రకటనలను ఎవరూ నమ్మవద్దని, వాటిని అధికారికమైనవిగా పరిగణించవద్దని కోరింది. ఈ విషయానికి సంబంధించి ఇదే తమ తుది వివరణ అని, దీనితో అన్ని రకాల అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియా వేదికలు, అలాగే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేస్తూ, అభిమానులు చూపిస్తున్న నిరంతర మద్దతుకు ఎన్టీఆర్ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. ‘RAW NTR’ అనే సంస్థను ప్రారంభించి సేవ కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రాబోతున్నాడని ఈ సంస్థ ద్వారా ప్రచారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమ్ స్పందించి వివాదానికి ముగింపు పలికింది.