Dragon | యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన బర్త్‌డేను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక క్యూట్ అండ్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు తారక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసిన తారక్.. తాజాగా తన ఇంట్లోకి వచ్చిన ఇద్దరు కొత్త అతిథులను అభిమానులకు పరిచయం చేశారు. అవి మరేవో కావు.. రెండు అందమైన, రంగురంగుల మెకా పక్షులు (పెద్ద రామచిలుకలు). వీటికి సంబంధించిన క్యూట్ ఫోటోలను ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ పక్షులకు ఆయన ‘అసాహి’ (Asahi), ‘యూహి’ (Yuuhi) అని నామకరణం చేశారు. ఇవి రెండు కూడా జపనీస్ పేర్లు కావడం విశేషం. జపనీస్ భాషలో ‘అసాహి’ అంటే ఉదయించే సూర్యుడు అని, ‘యూహి’ అంటే సూర్యాస్తమయం సాయంత్రం సూర్యుడు అని అర్థం. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. “నా పక్షులు అసాహి, యూహిలను మీకు పరిచయం చేస్తున్నాను. జపాన్ దేశంపై నాకున్న ప్రేమకు ఇవి ప్రతిబింబాలు” అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.
గతంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా విడుదలైనప్పటి నుంచి జపాన్‌లో ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత ‘దేవర’ ప్రమోషన్స్ కోసం కూడా ఆయన జపాన్‌లో పర్యటించారు. అక్కడి ప్రజలు చూపించిన అపూర్వమైన ఆదరణ, వారి సంస్కృతి తారక్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే జపాన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ తన పెంపుడు పక్షులకు ఈ ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. ఎప్పుడూ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించే ఎన్టీఆర్.. ఇలా తన పర్సనల్ లైఫ్‌లోని ప్రశాంతమైన, సున్నితమైన కోణాన్ని పంచుకోవడంతో నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ ఫోటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.