టాలీవుడ్లో ఉన్న అతికొద్ది మంది మహిళాదర్శకుల్లో ఒకరు జీవితారాజశేఖర్ (Jeevitha Rajashekar). ఆమె డైరెక్షన్లో రాజశేఖర్ (Rajashekar) నటిస్తోన్న తాజా చిత్రం శేఖర్ (shekar). ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు జీవితా రాజశేఖర్ మాటల్లోనే..
శేఖర్ సినిమాను డైరెక్ట్ చేయడానికి గల కారణం..?
నిజాయితీగా చెప్పాలంటే..ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. సాధారణ కానిస్టేబుల్ జీవితం చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఉంటుంది. సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నపుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్టోరీలైన్‌ను మార్చవద్దనుకున్నాం. అయితే డైరెక్టర్లు మాత్రం డిఫరెంట్ ఐడియాలతో మా దగ్గరకు వచ్చారు. అవేవి నచ్చకపోవడంతో ఈ సినిమాకు నేను డైరెక్టర్ క్యాప్ పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు జీవితా రాజశేఖర్. జీవితంలో ఒంటరి అయిన శేఖర్ అనే కానిస్టేబుల్ బాధలో కూరుకుపోతాడు. ఆ తర్వాత ఓ సమస్యపై పోరాడి ఎలా పరిష్కారం చేస్తాడనేది సినిమాలో చూపించబోతున్నాం. మంచి మనస్సున్న ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నామన్నారు.
ఒరిజినల్ స్టోరీలో ఏమైనా మార్పులు చేశారా..?
ఒరిజినల్ సినిమా జోసెఫ్ (Joseph) ను చూసినపుడు కొన్ని లోపాలు గుర్తించా. అయితే అవి లోపాలని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. తెలుగులో వాటిని మరింత ఉత్తమంగా చూపించవచ్చనిపించింది. కొన్ని మార్పులుంటాయి. మెయిన్ పాయింట్ అదే ఉంటుంది..కొన్ని సన్నివేశాలు మార్పులు చేశాం. ప్రతీ ఒక్కరూ ఎక్జయిట్గా ఫీలవడం పక్కా అని చెప్పుకొచ్చారు.
సినిమాలో నటించే ప్లాన్ ఏమైనా ఉందా..?
సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ నటించేందుకు నేనెపుడూ రెడీగా ఉంటా. కానీ నాకు సరైన పాత్రతో మంచి సినిమా దొరికితే చేయాలనుంది. అంతేకాదు నా భర్త రాజశేఖర్‌తో కూడా కలిసి నటించాలని ఉంది. అది త్వరలోనే జరుగబోతుందంటూ చెప్పుకొచ్చారు జీవితారాజశేఖర్.