సినిమా పేరు: దీవాన
తారాగణం: హర్షిత్‌రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేశ్, ఝాన్సీ..
దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి
సంగీతం: ఈశ్వర్‌చంద్
కెమెరా: వంశీ పచ్చిపులుసు
నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి..
గప్‌చుప్‌గా చిత్రీకరణ జరుపుకొని, గత రెండు నెలలు క్రితమే ప్రమోషన్స్ మొదలుపెట్టారు ‘దీవాన’ మేకర్స్. ఈ సినిమా టైటిల్, వివరాలు, ప్రచార చిత్రాలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడంతో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. అందరూ కొత్త వారితో చేసిన ఈ చిరు ప్రయత్నం విజయవంతమైందా? లేదా? అనేది తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..
కథ
డిగ్రీ చదుకొని కూడా ఉద్యోగం సద్యోగం లేకుండా ఫ్రెండ్స్‌తో వీధులెమ్మటి తిరిగే ఏ మాత్రం బాధ్యత లేని కుర్రాడు మున్నా(హర్షిత్‌రెడ్డి). ఎప్పుడూ గొడవలు, అల్లర్లు, ఫ్రెండ్స్‌తో సరదాలు.. ఇదే అతని దినచర్య. అలాంటి మున్నాకు అనుకోకుండా అమూల్య(స్మేహ మణిమేగలై) తారసపడుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమించేస్తాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెడతాడు. ఓ సమయంలో ఆమెకు లవ్ పప్రోజ్ కూడా చేస్తాడు. మున్నా వల్ల విసిగిపోయిన అమూల్య.. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని కొన్ని షరతులు విధిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించి వస్తే ప్రేమను ఓకే చేస్తానని, అప్పటిదాకా అసలు తనకు కనిపించటానికి కూడా వీల్లేదంటూ షరతులు విధిస్తుంది. తను ప్రభుత్వోజ్యోగం సాధించలేడని అమూల్య విశ్వాసం అనమాట. మరి అమూల్య ప్రేమ కోసం మున్నా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాడా? అమూల్య అనుకున్నట్టే మున్నా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందలేక చతికిల పడ్డాడా? అసలు మున్నా ప్రేమ ఫలించిందా? మున్నాను అమూల్య దూరం పెట్టడానికి గల కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
చాలాకాలం తర్వాత వచ్చిన కొత్త కథ ఇది. ఈ విషయంలో దర్శకుడ్ని నిజంగా అభినందించాల్సిందే. అతను ఎంచుకున్న పాయింట్ నిజంగా అద్భుతం. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అందర్నీ షాక్‌కి గురి చేసిన దర్శకుడు, క్లైమాక్స్‌లో మళ్లీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ కథను దర్శకుడు నడిపించిన తీరును బట్టే అతనెంత సమర్థుడో అవగతం అవుతుంది. కథనంలో ఏది దాచిపెట్టాలో, ఎక్కడ ఏది రివీల్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి. అందుకే.. ఈ సినిమా విజయం క్రెడిట్లో సింహభాగం అతనికే దక్కుతుంది. క్యారెక్టరైజేషన్లను కూడా ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నాడు తను. ఈ కథ ద్వారా స్నేహం గొప్పతనం చెప్పాడు. అమ్మానాన్నల ప్రేమ ఎంత విలువైంతో చెప్పాడు. ప్రేమకు ఎంతటి శక్తి ఉందో చెప్పాడు. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలీయజేశాడు. ఇన్ని విషయాలనూ కూడా వినోదాత్మకంగా, ఎక్కడా విసుగన్నది లేకుండా చెప్పిన దర్శకుడు ప్రతిభను తప్పకుండా అభినందించాల్సిందే. టాలీవుడ్‌కి ఓ మంచి దర్శకుడు దొరికాడని చెప్పొచ్చు. ఈ సినిమాలోని ఇంటర్వెల్, ైక్లెమాక్స్‌లో వచ్చే మలుపులు సినిమా విజయానికి ప్రధాన పాత్రలు పోషిస్తాయి. ప్రతి మలుపు ఆయా పాత్రల గొప్ప తనాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ పాత్రలు అప్పటివరకూ అనుభించిన మానసిక వేదన, కష్టం గొప్పతాన్ని తెలియజేస్తాయి. ఈ సినిమా ప్రథమార్థం అద్భుతం. ద్వితీయార్ధం మహాద్భుతం.
నటీనటులు
మున్నాగా యువనటుడు హర్షిత్‌రెడ్డి చాలా గొప్పగా నటించాడు. అతని పాత్ర చిత్రణ నేటి తరం యువకులకు అద్దం పట్టేలా ఉన్నది. అతని బిహేవియర్, యాటిడ్యూడ్ అందరికీ నచ్చుతుంది. కామెడీనే కాదు, ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా పలికించాడు హర్షిత్. ఇక అమూల్య పాత్ర పోషించిన స్మేహ మణిమేగలై ఈ సినిమాకు వెన్నెముక లాంటి పాత్ర పోషించింది. అసలు ఆ తరహా పాత్రలో ఆమెను ఎవరూ ఊహించలేరు. అంత అద్భుతంగా నటించింది కూడా. ఓ విధంగా హీరోహీరోయిన్లిద్దరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో నటుడు నరేశ్. మధ్య తరగతి తండ్రిగా ఒదిగిపోయి నటించారాయన. ఝాన్సీ నుంచి మిగతా పాత్రధారులంతా పరిధిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
కథే ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన కథ రాసుకొని, దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం. ఇక ఈ సినిమా కెమెరా వర్క్ కూడా బావుంది. సందర్భానుగుణంగా ఈశ్వర్‌చంద్ ఇచ్చిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. మొత్తంగా వేలెత్తి చూపించే అంశాలు ఇందులో మచ్చుకైనా కనిపిచవు. చివరిగా చెప్పేదేంటంటే.. ఇది కేవం యూత్‌కి మాత్రమే కాదు.. ప్రతి వయసు వారూ చూడాల్సిన సినిమా.. చూడదగ్గర సినిమా. ఇది కొత్తవాళ్లతో చేసిన సినిమా. అందుకే థియేటర్లకు జనం రావడం కష్టం. అందుకే.. విభిన్నమైన ప్రమోషన్స్‌తో సినిమాను జనంలోకి తీసుకెళ్లగలిగితే.. ఈ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ కథ తప్పకుండా రీమేక్ అవుతుంది. అంత గొప్ప కథ ఇది.
బలాలు
కథ, కథనం, నటీనటుల నటన, సంగీతం, కెమెరా..
బలహీనతలు
పబ్లిసిటీ
రేటింగ్
3.5/5