‘ఏ రంగంలోని వారైనా ఒక్కో మెట్టెక్కుతూ ఎదగాలి. ప్రతిభను ఉన్నతీకరించుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే అద్భుత విజయాలు సాధ్యమవుతాయి’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్’ నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. ఈ సందర్భంగా హీరో ఆశిష్‌తో కలిసి దిల్‌రాజు పాత్రికేయులతో సంభాషించారు. ఆ సంగతులివి..
హీరో అవుదామని ఎప్పుడనుకున్నారు? మీ నిర్ణయాన్ని చెప్పినప్పుడు బాబాయ్ దిల్‌రాజుగారు ఏమన్నారు?
ఆశిష్: చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌లంటే ప్రాణం. మా కుటుంబంలో ఎలాంటి వేడుకలైనా నా పర్ఫార్మెన్స్ తప్పకుండా ఉండాల్సిందే. అదీగాక నేను అల్లు అర్జున్ అభిమానిని కాబట్టి ‘ఎప్పటికైనా బన్నీ అన్నలా కావాలి. ఆయనలా యాక్టింగ్, డ్యాన్స్ చేయాలి’ అని అనుకునేవాడిని. అలా నటనపై తెలియకుండానే ఆసక్తి పెరిగింది. న్యూయార్క్, హైదరాబాద్, ముంబయిలో ప్రముఖుల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. ‘కేరింత’ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశా.
దిల్‌రాజు: ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఆశిష్ చేసే డ్యాన్సులు చూసి మా ఆవిడ ‘ఆషుని హీరో చేయండి’ అని చెబుతుండేది. ఇంట్లో అందరు హీరో అని పిలుస్తుండటంతో ఆశిష్‌కు నటనపై ఇంట్రెస్ట్ పెరిగింది. హీరో అవుదామని ఆశిష్ నాతో అన్నప్పుడు ‘చాలా హార్డ్‌వర్క్ చేయాలి. మా మద్దతు ఒకటిరెండు సినిమాలకు మాత్రమే ఉంటుంది. ప్రేక్షకులకు రీచ్ కాలేకపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు’ అని సలహా ఇచ్చాను. మొదట్లో ఆశిష్ చాలా లావుగా ఉండేవాడు. స్లిమ్ అయి కనిపించు…అప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ చేసే విషయం ఆలోచిద్దామన్నా. కొన్ని నెలల తర్వాత ఇరవైఐదు కిలోలు తగ్గి నా దగ్గరకు వచ్చాడు. దాంతో ఆశిష్‌పై నమ్మకం కుదిరింది.
సినిమా కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఆశిష్: ఇంజినీరింగ్, మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే కథ అని చెప్పగానే కొత్తగా అనిపించింది. దర్శకుడు హర్ష కూడా మా ఏజ్‌గ్రూప్ కావడంతో మా టీమ్ అందరి అభిరుచులు కలిశాయి. ప్రతిరోజు ఏడెనిమిది గంటల పాటు వర్క్‌షాప్స్ చేస్తూ అన్ని విషయాల్లో సినిమా బెటర్‌గా వచ్చేలా ప్రయత్నించాం.
దిల్‌రాజు: యువతను లక్ష్యంగా చేసుకొని ఈ సినిమా చేశాం. ‘ప్రేమదేశం’ వచ్చి ఇరవైఏళ్లయింది. ప్రస్తుతం అలాంటి యూత్కంటెంట్తో ఉన్న సినిమా కావాలనుకున్నాం. తన కాలేజీ జీవితంలోని సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు హర్ష ఈ కథ రాసుకున్నాడు. యువతకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉంటాయి. ఇందులో ఆశిష్ అద్భుతమైన డ్యాన్స్‌లు చేయడంతో పాటు తన నటనతో అందరిని నవ్విస్తాడు..ఏడిపిస్తాడు.
అగ్ర నిర్మాతగా ఎందరో హీరోల్ని పరిచయం చేశారు కదా..ఆశిష్‌కు కెరీర్‌పరంగా మీరిచ్చే సలహాలేమిటి?
దిల్‌రాజు: ప్రేక్షకుల గుర్తింపు పొందాలంటే మనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. మనమే ఒక బ్రాండ్ కావాలి. ఒక బ్రాండ్‌గా మారితేనే విలువ ఉంటుందని ఆశిష్‌కు చెబుతుంటాను. మొదటి రెండు సినిమాల వరకే నేను సహాయం చేస్తాను.. ఆ తర్వాత నువ్వే దర్శకుల్ని, నిర్మాతల్ని వెతుక్కోవాలని ఆశిష్‌కు చెప్పాను.
ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన అంశాలేమిటి?
ఆశిష్: ప్రతిరోజు ఓ సవాలుగానే అనిపించింది. సీన్ పేపర్ తీసుకొని రాత్రంతా రిహార్సల్ చేసి షూటింగ్‌కు సిద్ధమయ్యేవాడిని. డ్యాన్సుల విషయంలో మాత్రం ఎలాంటి రిహార్సల్ లేకుండా చేశాను.
‘నేను కుటుంబకథా చిత్రాల్నే చేస్తాను..కానీ ఈ సినిమా విషయంలో తొలిసారి నా లైన్ దాటాను’ అని ఈ మధ్య సినిమా ప్రమోషన్లో అనడానికి కారణం?
దిల్‌రాజు: కొత్తతరం దూసుకొస్తున్న ఈ తరుణంలో మూసలో వెళ్తానంటే కుదరదు. అందుకే లైన్ క్రాస్ చేసి యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో సినిమా చేశా. ఏ జోనర్ సినిమా చేసినా విలువల్ని మాత్రం విస్మరించను. కథ డిమాండ్ మేరకు ముద్దు సన్నివేశాల్ని పెట్టాం. సినిమాలో ఎలాంటి అశ్లీలత కనిపించదు. ప్రస్తుతం ఉన్న ఓటీటీ యుగంలో మార్పుని అంగీకరించకపోతే ఇలాగే ఉండిపోతాం. అందుకే నిర్మాతగా కథల ఎంపికలో నా ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నా. ఆ దిశగా ‘రౌడీబాయ్స్’తో తొలి అడుగు పడింది.
ఈ సంక్రాంతి సినిమా సీజన్ గురించి..?
దిల్‌రాజు: సాధారణంగా సంక్రాంతి సీజన్ సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ కావాలి. ఇది యువతరం సినిమా కాబట్టి వాళ్లు ఎలాంటి సంకోచం లేకుండా వస్తారు. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మొదటి రెండు వేవ్‌లకంటే మూడో వేవ్ అంత ప్రమాదకారి కాదని తెలిసింది. వైరస్ సోకిన వారు ఐదురోజుల్లోనే కోలుకుంటున్నారు. రిస్క్ శాతం తగ్గిపోయింది కాబట్టి సంక్రాంతి సీజన్ మా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నా.
నిర్మాతగా బ్రాండ్ నుంచి బయటకొచ్చానని చెప్పారు..భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి?
దిల్‌రాజు: మా కుటుంబం నుంచి హర్షిత్, హన్షిత ప్రొడక్షన్లోకి వస్తున్నారు. ఆశిష్ నటన మీద దృష్టిపెట్టాడు. కొత్త జనరేషన్ కాబట్టి నవ్యమైన ఆలోచనలతో వారు ముందుకొస్తున్నారు. హర్షిత్, హన్షిత కొత్త ప్రాజెక్ట్‌లను టేకాఫ్ చేస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా మా బ్యానర్లో సినిమాలు చేయాలనుకుంటున్నాం.