Vijay Sethupathi | గాడ్‌ఫాదర్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. ‘జూనియర్ ఆర్టిస్టుగా వచ్చాను. సింగిల్ డైలాగ్ కేరక్టర్లు కూడా చేశాను. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను. ఏం చేసినా.. ఎంత ఎదిగినా.. చివరి లక్ష్యం మాత్రం ఒక్కటే. నటుడిగా కొన్నేళ్లపాటు నన్ను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి.’ అంటారాయన. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు విజయ్ సేతుపతి. ‘ మనం ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు.. ఆ కోరికను బలంగా అనుకోవాలి. మనస్ఫూర్తిగా కోరుకోవాలి. తగిన ప్రయత్నాలు చేయాలి.
మన కోరికలో నిజాయితీ ఉంటే, లక్ష్యం సరైనదే అయితే.. ఆ కోరికను తీర్చడానికి దేవుడెప్పుడూ రెడీగా ఉంటాడు. నేను చిన్నప్పట్నుంచీ యాక్టర్ కావాలని కలలు కన్నా. బలంగా కోరుకున్నా. ఆ కోరికే నన్ను లక్ష్యం వైపు నడిపించింది. ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఒకవేళ మనం అనుకున్నది నెరవేరట్లేదు అంటే, మన ప్రయత్నంలో లోపం ఉన్నట్టే. లక్ష్యంపై మనసు లగ్నం చేయనప్పుడు ప్రకృతికి కూడా సహకరించదు.’ అంటూ అద్భుతమైన విషయాలు చెప్పారు విజయ్ సేతుపతి.