KA Collections | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ (KA) బాక్సాఫీస్ వసూళ్లపై ఇప్పుడు సరికొత్త వివాదం చేలరేగింది. ఈ సినిమా సాధించినట్లు చెబుతున్న వసూళ్లు 99 శాతం అవాస్తవమంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్న తరుణంలో.. చిత్ర నిర్మాత స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత నెయ్యి పోశాయి.
ఇటీవల హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ‘రావు బహదుర్’ చిత్ర సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ‘క’ చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ‘క’ సినిమా కలెక్షన్ల ప్రస్తావన రాగా ఆయన స్పందిస్తూ.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ పరంగా పెద్దగా వసూళ్లేమీ రాలేదన్నట్లుగా మాట్లాడారు. “ఆ సినిమా వల్ల చివరకు మిగిలింది ఏంటంటే.. కేవలం ఆ చిత్రంలో నటించిన ఆర్టిస్టుల భవిష్యత్తు మాత్రమే” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
నిర్మాత నోటి నుంచే ఈ మాటలు రావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘క’ సినిమాకు థియేట్రికల్‌గా అసలు లాభాలే రాలేదని, నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద రూపాయి కూడా మిగలలేదని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వసూళ్ల పోస్టర్లు అన్నీ కేవలం ప్రమోషన్ల కోసం, హైప్ క్రియేట్ చేయడం కోసం వేసిన నంబర్లేనని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కిరణ్ అబ్బవరం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ చిత్రంపై ఇలాంటి కలెక్షన్ల దుమారం రేగడం చర్చనీయాంశమైంది. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారంపై మరియు నిర్మాత వ్యాఖ్యలపై హీరో కిరణ్ అబ్బవరం కానీ, చిత్ర బృందం కానీ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.