Christopher Nolan | ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) నుంచి సరికొత్త ‘కౌంట్‌డౌన్ ట్రైలర్’ విడుదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ రిలీజ్ చేసిన ఈ ఫైనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆమాంతం పెంచేసినట్లు తెలుస్తుంది.
గ్రీక్ పురాణాల నేపథ్యంలో ఒక అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇథాకా రాజు ‘ఒడిస్సియస్’ తన సొంత రాజ్యానికి, భార్య వద్దకు తిరిగి రావడానికి చేసిన 10 సంవత్సరాల సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణమే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో ఒడిస్సియస్‌గా హాలీవుడ్ స్టార్ నటుడు మాట్ డామన్ నటిస్తుండగా, అతని భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో సముద్రపు తుఫానులు, యుద్ధ సన్నివేశాలు, భయంకరమైన సైక్లోప్స్ (భారీ ఆకారంలో ఉండే రాక్షసులు) సైరెన్స్ ఎదుర్కొనే దృశ్యాలను గ్రాండ్‌గా చూపించారు.
ఈ చిత్రంలో టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, లుపితా న్యాంగో, షార్లిజ్ థెరాన్ వంటి స్టార్ నటులు నటిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 17న గ్రాండ్‌గా విడుదల కానుంది.