హీరో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. నయనతార నాయికగా నటిస్తుండగా..బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రాజకీయ నేపథ్య కథతో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బృందం యూ.ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇటీవల ఈ చిత్రం నుంచి చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘థార్ మార్ థక్కర్ మార్..’ పాటకు మంచి స్పందన వస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, సంగీతం : థమన్.