ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న బాయ్‌కాట్ ట్రెండ్స్‌పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏం మాట్లాడినా తప్పైపోతున్నదని ఆవేదన చెందారు. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ గురువుగా కీలక పాత్రను పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదలకానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమాల సందర్భంగా బాయ్‌కాట్ ట్రెండ్ గురించి స్పందిస్తూ కథానాయిక అలియాభట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
నేనంటే ఇష్టం లేకపోతే నా సినిమాల్ని చూడటం మానేయండి కానీ.. బాయ్‌కాట్ అంటూ దుష్ప్రచారం చేయడం తప్పని హెచ్చరించింది. దాంతో ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ ట్రెండ్ ట్విట్టర్లో ఊపందుకుంది. ఈ విష ప్రచా రం గురించి పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తూ అమితాబ్ బచ్చన్ హిందీ లో ఓ ట్వీట్ చేశారు. ‘చాలా పనులు చేయాలనుకుంటున్నా. కానీ ఎలా చేయాలో తెలియడం లేదు.
ఏం మాట్లాడినా ఈ రోజుల్లో పెద్ద విషయంగా మారిపోతున్నది’ అని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల బాలీవుడ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అమితాబ్ బచ్చన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈ ట్వీట్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అమితాబ్ బచ్చన్ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.