Negha Shahin | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ట్రాన్స్జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు 2026’పై ట్రాన్స్జెండర్ నటి, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత నేఘా షాహిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసిన ఆమె, తెరపై ట్రాన్స్జెండర్ పాత్రలు పోషించి స్టార్డమ్ సంపాదించుకున్న నటుల మౌనాన్ని ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్), రాఘవ లారెన్స్ (కాంచన), మరియు కాళిదాస్ జయరామ్ (పావ కదైగల్) వంటి నటులు మా కష్టాలను సినిమాల్లో చూపిస్తూ అవార్డులు, గుర్తింపు పొందుతున్నారని, కానీ నిజ జీవితంలో మా హక్కులకు భంగం కలిగే చట్టాలు వస్తున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీశారు. మౌనం వహించడం అంటే పరోక్షంగా ఈ అన్యాయానికి మద్దతు తెలపడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాన్స్జెండర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ పొందాలనే నిబంధనను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. సాధారణ వ్యక్తులు ఎవరైనా తమ లింగాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి పరీక్షలు ఎదుర్కొంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఈ బిల్లుపై పునరాలోచించాలని కోరిన నేపథ్యంలో, తాను కూడా డీఎంకే పార్టీ తరపున ఈ పోరాటంలో పాల్గొంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. క్వీర్ కాస్టింగ్ సంస్థ ద్వారా ట్రాన్స్జెండర్లకు సినీ అవకాశాల కోసం కృషి చేస్తున్న నేఘా, సినీ పెద్దలు ఇకనైనా తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని డిమాండ్ చేశారు.