‘సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వమున్నా నేను, మహేష్‌బాబు,ప్రభాస్ స్వీయ ప్రతిభతోనే ఎదిగాం.ఆ గుణాలన్నీ ఆశిష్లోనూ కనిపిస్తున్నాయి’ అని అన్నారు అగ్రహీరో రామ్‌చరణ్. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీబాయ్స్’ మ్యూజికల్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘ట్రైలర్లో ఆశిష్ ఎనర్జీ, డ్యాన్స్‌లు బాగున్నాయి. అద్భుతంగా నటించాడు. ప్రతిభతో పాటు క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా ఎక్కువకాలం రాణించగలుగుతాం. మా నాన్న నాకు చెప్పిన మాట అదొక్కటే. ఏ విధంగా నటించాలో..ఎలా డ్యాన్స్ చేయాలో చెప్పలేదు కానీ చెప్పిన సమయానికి షూటింగ్లో ఉండాలని నేర్పించారు. ఈ సినిమా తర్వాత ఆశిష్ పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నా. బాధ్యతతో తీసిన సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాం. సరైన సమయంలో ఆ సినిమా విడుదలకావాలని కోరుకుంటున్నా. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ సంక్రాంతులను దిల్‌రాజు చూశారు. ఈ సంక్రాంతి ఆయనకు మరోసారి కలిసి రావాలి.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘నిర్మాతగా ‘దిల్’ సినిమా ద్వారా తొలి సక్సెస్‌ను అందుకున్నా. ఆ తర్వాత ‘ఆర్య’తో సూపర్‌హిట్, ‘భద్ర’తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాం. ఆ విజయం పరంపరకు ‘జోష్’తో బ్రేక్ పడింది. ఆ అపజయం నుంచి నేర్చుకున్న పాఠాలతో ‘బృందావనం’ తెరకెక్కించి హిట్ అందుకున్నా. ఆ తర్వాత నా కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు వచ్చాయి. కానీ ఆత్మసంతృప్తి మాత్రం దొరకలేదు. 2017 నుంచి నా ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. వరుసగా ఆరు సినిమాలతో సక్సెస్‌లు వచ్చాయి. తొలి సినిమా సమయంలో హిట్ కొట్టాలనే తపన ఎలా ఉందో అదే పట్టుదలతో ‘రౌడీబాయ్స్’ సినిమా చేశా. నిర్మాతగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో అగ్రనటీనటులందరితో విజయవంతమైన సినిమాలు చేశా. కానీ ఆశిష్ మా ఇంట్లో నుంచి పరిచయమవుతున్న హీరో కావడంతో ఓ బాధ్యతగా భావించి ఈ సినిమా చేశాం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదాపడటంతో ఈ సంక్రాంతి మాకు కలిసివచ్చింది. తప్పకుండా పండుగకు డబుల్ హ్యాట్రిక్ అందుకుంటామనే నమ్మకముంది. సంక్రాంతి మాదే అనిపించుకుంటాం. మంచి సక్సెస్‌తో సినిమా కోసం పడిన కష్టాలన్నీ మర్చిపోతామనే నమ్మకముంది’ అని పేర్కొన్నారు.
‘ప్రతిభను మాత్రమే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రోత్సహిస్తుంది. నేను బాగా నటిస్తాననే నమ్మకం కలిగిన తర్వాతే బాబాయ్ దిల్‌రాజు, నాన్న శిరీష్ నన్ను హీరోగా ఎంచుకున్నారు. ఈ స్థాయికి రావడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ సినిమా ద్వారా మా కుటుంబం గర్వపడేలా చేస్తాననే నమ్మకముంది’ అని ఆశిష్ అన్నారు.