పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద ఉన్న ఫండ్లు (పీఎంఎఫ్) మదుపరులకు ఆకర్షణీయమైన రాబడులను పంచుతున్నాయి. 75 శాతానికిపైగా ఫండ్స్.. గడిచిన పదేండ్లలో మ్యూచువల్ ఫండ్స్‌ను మించి హై నెట్‌వర్త్ ఇండివీడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)కు ఆదాయాన్నిచ్చాయి మరి. దీంతో బడా ఇన్వెస్టర్లు ఈ రకమైన పెట్టుబడులను ఓ లుక్కేయవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
నిపుణుల చేతిలో మీ పెట్టుబడులుండటం ఈ పీఎంఎఫ్ ప్రయోజనాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మార్కెట్ ఒడుదొడుకుల్ని తట్టుకుని మదుపరుల పెట్టుబడుల్ని ఎలా లాభాల బాట పట్టించాలో వీటిల్లో ప్రయోగాత్మకంగా ప్రొఫెషనల్స్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడి పోర్ట్‌ఫోలియో మేనేజర్లు మదుపరుల ప్రధాన ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా రిటర్నులను రాబడుతున్నారు.
అందుకే హై నెట్‌వర్త్‌తో ఉన్న ఇన్వెస్టర్లు, పెట్టుబడులపై అంతగా అవగాహనలేనివారు, పెట్టుబడులను పరిశీలించడానికీ తీరికలేనివారు, మార్కెట్ ఒడుదొడుకుల నుంచి రక్షణను పొందాలనుకునేవారు పీఎంఎఫ్ల్లో పెట్టుబడులను ఎంచుకోవడమే తెలివైన పని అన్నది మెజారిటీ నిపుణుల వాదన కూడా. 1, 3, 5, 10 ఏండ్ల వ్యవధిలో 388 రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్, 335 పీఎంఎస్ ఫండ్ల ప్రదర్శనల్ని పోల్చిచూస్తే అన్ని కేటగిరీల్లో ఆకట్టుకునే స్థాయిలో సగటున 70 శాతం పీఎంఎఫ్లు అదరగొట్టాయి. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఈ సగటు 48 శాతమే. లార్జ్, మిడ్, స్మాల్, లార్జ్-మిడ్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీక్యాప్ కేటగిరీల్లో చూసినా పోర్ట్‌ఫోలియో మేనేజర్ల చేతిలో ఉన్న ఫండ్స్ సురక్షితమేనన్న అభిప్రాయాలున్నాయి.