Amazon layoffs : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (E-Commers Company) అమెజాన్ (Amazon) మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించింది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. భారత్ (India), అమెరికా (US), యూకే (UK) సహా పలు దేశాల్లోని రిటైల్ బృందాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. రానున్న రోజుల్లో దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలనే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తాజా ఉద్యోగుల కోతలు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించే ‘స్టోర్స్’ వ్యాపార విభాగానికి చెందిన ఉద్యోగులను తాజాగా తొలగించినట్లు రాయిటర్స్, బిజినెస్ ఇన్సైడర్ నివేదికలు పేర్కొన్నాయి. తమ ప్రాధాన్యతలను మెరుగ్గా చేరుకోవడానికి వీలుగా స్టోర్స్ బిజినెస్‌లో కొన్ని సర్దుబాట్లు చేశామని అమెజాన్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు వివరించారు. అయితే ఎంతమందిని తొలగించారనే కచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడమే ప్రస్తుత తొలగింపులకు కారణమని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అన్నారు.
కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై ఎక్కువగా ఆర్డర్లు చేశారని, అది తమకు చాలా ఒత్తిడితో కూడిన కాలమని, అందుకే అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నామని ‘ఫాక్స్ న్యూస్’ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బెజోస్ పేర్కొన్నారు. కాగా భారత్‌లో ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్’ ఫెస్టివల్ సేల్.. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రైమ్ బిగ్ డీల్ డేస్’ సేల్ ప్రారంభమైన తరుణంలోనే ఈ లేఆఫ్‌లు జరగడం గమనార్హం.
మంగళవారం రోజున ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దాంతో ప్రభావిత ఉద్యోగులు కంపెనీ అంతర్గత స్లాక్ ఛానెల్లో సెవరెన్స్ ప్యాకేజీ, నోటీస్ పీరియడ్, ఇతర అవకాశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ మరోవైపు అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.