తెలంగాణ‌లో ఉన్న న‌రసింహ‌స్వామి ఆల‌యాలివే..

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువయ్యాడు నరసింహుడు. 13వ శతాబ్దంలో కాకతీయ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

మల్లూరు హేమాచల నరసింహ క్షేత్రానికి వేల ఏండ్ల‌ చరిత్ర ఉన్నది. కొండపై కొలువైన నరసింహ స్వామి మూల విరాట్‌ ఒంటి నిండా రోమాలతో, సహజ శరీరంతో అలరారుతుంది.

ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడి కొండ స్తంభం ఆకారాన్ని పోలి ఉండటంతో ఈ క్షేత్రానికి ‘స్తంభాద్రి’ అనే పేరు వచ్చింది.

ధర్మపురిలో నరసింహస్వామి యోగానందమూర్తిగా కనిపిస్తాడు. పూర్వం ధర్మవర్మ మహారాజు తన ప్రజలందరినీ ధర్మమార్గంలో నడిపించినందుకే ఈ క్షేత్రానికి ‘ధర్మపురి’ అనే పేరు వచ్చినట్లు స్థలపురాణం.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంలో లక్ష్మీదేవి సమేతంగా వెలిశాడు నరసింహస్వామి. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా, ఇక్కడ లింగ రూపంలో కొలువయ్యాడు. 

నరసింహుడి ఉచ్ఛ్వాస.. నిశ్వాసలతో మహిమాన్వితంగా వెలుగొందుతున్నది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి క్షేత్రం. 

హిరణ్యకశిపుడిని హతమార్చిన తర్వాత నరసింహుడు దండకారణ్యంలో తిరిగాడట. నిజామాబాద్‌ జిల్లా  జానకంపేట కొండ ప్రాంతానికి వచ్చి, కాసేపు ఇక్కడే సేదతీరాడట. ఇక్కడే స్వయంభువుగా వెలిశాడట.

What to look for:

సహజసిద్ధ శ్వేతగిరి కొండల్లో స్వయంభువుగా శ్రీవారు వెలసిన దివ్య క్షేత్రం. స్వామివారి పాదాలను తాకుతూ పరవళ్లు తొక్కే పవిత్ర హరిద్రా నది ప్రవాహం. వెరసి రెండో యాదాద్రిగా భక్తజనుల ఆదరణ పొందుతున్నది.. నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం.

అలరించే ప్రకృతి సౌందర్యం, కృష్ణా తరంగాల సారంగ రాగాల నడుమ వెలిసిన దివ్యక్షేత్రం మట్టపల్లి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడు.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట స‌మీపంలో కొండపై కొలువుదీరాడు స్వామి. దేవుడు ఉన్న గుట్టను నరసింహాచలం అనీ, దేవునిగుట్ట అనీ పిలుస్తారు. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి 1437 నాటి శాసనంలో ఉంది.