e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ అమ్మకోసం.. నడవాలని ఉంది!

అమ్మకోసం.. నడవాలని ఉంది!

కోరుకున్న ఉద్యోగం, కొండంత జీతం వెరసి అందమైన జీవితం.ఒక్కరోజులో అన్నీ తలకిందులయ్యాయి. ఊహించని ప్రమాదం ఆమె వెన్నెముక సత్తువను లాగేసుకుంది. రెండు కాళ్లను కదలనీయకుండా చేసింది. లేడిపిల్లలా పరుగులెత్తే ఆ యువతిని వీల్‌చైర్‌కే పరిమితం చేసింది. ఈ స్థితిలో మరెవరైనా అయితే కుంగిపోయేవారే! కానీ, ఆమె కించిత్‌కూడా చింతించలేదు. ‘ఇక మీ జీవితం వీల్‌చైర్‌కే పరిమితం. మనసు దృఢం చేసుకోండి’ అన్న వైద్యుల మాటలు నిజం కాకూడదని పోరాడుతున్నది. వాకర్‌ సాయంతో మళ్లీ అడుగులు వేస్తున్నది హైదరాబాద్‌కు చెందిన సిందూరి. మొక్కవోని దీక్షతో స్టార్టప్‌ను నెలకొల్పి సత్తా చాటుతున్నది.

అమ్మకోసం.. నడవాలని ఉంది!

పుట్టుకతో వచ్చే వైకల్యాన్ని శరీరం సమర్థంగానే ఎదుర్కొంటుంది. కానీ, జీవితం మధ్యలో శరీరంలోని ఓ భాగం పని చేయనని మొండికేస్తే మానసికంగా తట్టుకోవడం కష్టం. శారీరకంగా సిద్ధమవ్వడం మరింత దుర్భరం. ఇలాంటి పరిస్థితే ఎదురైంది సిందూరికి. బాగా చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేదామె. 2011లో ఓ రోజు విధులు ముగించుకొని క్యాబ్‌లో ఇంటికి బయల్దేరింది. అనుకోకుండా యాక్సిడెంట్‌. ఆ ప్రమాదంలో సిందూరి వెన్నెముక దెబ్బ తిన్నది. నాటినుంచి ఆమె కాళ్లు కదలకుండా అయిపోయాయి. వీల్‌చైర్‌కే పరిమితమైంది. కానీ, మొక్కవోని దీక్ష ఆమెలోని దక్షతను ఇనుమడింప జేసింది.

తనలాంటి వారికి అండగా..
కదల్లేని స్థితిలో సిందూరికి కుటుంబం అండగా నిలిచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జీవితాన్ని సవాలుగా స్వీకరించింది. తను ఉద్యోగం చేసే కంపెనీ కొంత జీతం ఇస్తూ ఇంటినుంచే పనిచేసే వెసులుబాటును కల్పించింది. సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్న తర్వాత పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటామని మాటిచ్చింది. ఇంటిపట్టునే ఉంటూ ఇచ్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి మంచి గుర్తింపును పొందింది సిందూరి. మరోవైపు సొంతంగా వ్యాపారం చేయాలనుకుందామె. బంధువుల భాగస్వామ్యంతో ‘ఏరియల్‌ ఏజెన్సీ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. బేకరీలు, రెస్టారెంట్‌లు, హోటళ్లకు కావాల్సిన దినుసులను సరఫరా చేయడం ఈ స్టార్టప్‌ ఉద్దేశ్యం. పనిలో తలమునకలైతే వైకల్యాన్ని మరచిపోవచ్చని సిందూరి ఆలోచన. 2018లో జరిగిన ‘మిస్‌ ఎబిలిటీ’లో విజేతగా నిలిచింది సిందూరి. అంతేకాదు, తనకు ఇష్టమైన కీబోర్డ్‌ వాద్యం నేర్చుకుంది. అందులోనూ, చక్కటి ప్రతిభను చాటుతూ ‘కళారత్న’ బిరుదును అందుకుంది. అనేక మారథాన్‌లలో పాల్గొని సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నది సిందూరి. ఎందరికో ఆదర్శంగానూ నిలుస్తున్నది.

ఆ రోజులు మళ్లీ..
నేను ఏదో ఒకరోజు ‘పూర్తిస్థాయిలో నడుస్తానని’ అమ్మ నమ్మకం. ఆ మాటలు నాకెంతో బలం. ప్రమాదం జరిగిన కొత్తలో మానసికంగా చాలా కుంగిపోయాను. ఒక్కదాన్నే ఉండాలంటే భయపడేదాన్ని. కానీ, అమ్మానాన్న సపోర్ట్‌తో ఎంతో మారాను. అమ్మకోసమే నేను నడవాలనుకుంటున్నా. ఇప్పుడు వాకర్‌ సాయంతో అడుగులు వేయగలుగుతున్నా. తొందర్లోనే స్వయంగా నడుస్తా. తిరిగి నా ఉద్యోగంలో చేరుతాను. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.

  • సిందూరి

కిరణ్‌కుమార్‌ ఇడుమాల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మకోసం.. నడవాలని ఉంది!

ట్రెండింగ్‌

Advertisement