e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ సిట్ట సిట్టెండా కొట్టె!

సిట్ట సిట్టెండా కొట్టె!

పసితనంలో.. ‘ఏడువాకు ఏడువాకూ ఎడ్డిపాపాయి’ అనే పాట పాడితే ఊరుకునేది. బడీడులో.. ‘అజ్ఞానాన్నే తొలగించు. అవనికి వెలుగులు అందించూ’ అని పాడితే స్కూల్‌కు వెళ్లేది. పెద్దయ్యాక.. ‘నాగ వడియాల సీరె.. నా పట్టురైకె’ అంటూ పల్లెపదం పాడితే పరవశించేది. ఇప్పుడు.. ‘సిట్ట సిట్టెండా కొట్టె సెట్టిగురు పెట్టె’ అంటూ తానే ఆడి పాడుతున్నది!

సిట్ట సిట్టెండా కొట్టె!

కోలాటం, జడకొప్పులాట తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. కంప్యూటర్‌ బ్రౌజింగ్‌ కాలంలో జడకొప్పులాంటి ఆటను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ, భావన మాత్రం ఆనంద పారవశ్యం పొందింది. తెలంగాణ మూలాల్ని పట్టుకున్నది. జానపద సంస్కృతిని అనుసరించింది.
ఆట, పాటకు సోపతయింది. యూట్యూబ్‌ వేదికగా ‘సిట్ట సిట్టెండా కొట్టె’ బన్నీ యాదవ్‌గా అలరిస్తున్న ఆదె భావన మనసులోని మాట.

మాది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోట. మా అమ్మమ్మ వాళ్ల ఊరు రామారావుపల్లె. నేను ఎక్కువగా అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటాను. అక్కడే జానపద సంస్కృతి అబ్బింది. మా తాతవ్వ లచ్చిందేవవ్వ సుట్టూ పన్నెండూర్ల ఫేమస్‌. బతుకమ్మ పాటలు మస్తు పాడుతుండేది. ఇప్పుడు తొంభై ఐదేండ్లు ఉంటుండొచ్చు. ఇప్పటికీ మంచి పాటలు పాడుతుంది. తాతవ్వనుంచి కళ అమ్మమ్మకు, ఆమెనుంచి మామయ్యలకు అబ్బింది. పెద్ద మామయ్య గంగస్వామి, చిన్న మామయ్య మహేందర్‌లకు జానపదాలంటే ఇష్టం. జడకొప్పులు, కోలాటాలు వేస్తుంటారు. బతుకమ్మ పాటలు పాడుతుంటారు. వాళ్లను చూస్తూ పెరిగాను కాబట్టి, జానపద సంస్కృతి నన్నూ ఆవహించింది. జానపద కళలోని మాధుర్యం చిన్నతనంలోనే తెలిసింది. పాటంటే పానమెల్లదీసుకునేదాన్ని. డ్యాన్సంటే ఎగిరి గంతేసేదాన్ని.

కళలపై ఆసక్తి
కల్వకోటలో చదువుతున్నప్పుడు నాకు తొలిసారిగా పాడే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ఆరో తరగతి అనుకుంటా. తొలిపాటగానే జానపదం ఎంచుకున్నా. అందరి మెప్పూ పొందాను. పాటతోపాటు నాకు డ్యాన్స్‌పైనా ఆసక్తి ఏర్పడింది. అందరూ సినిమా పాటలకు చేస్తుంటే నేను దేశభక్తి, జానపద గీతాలకు డ్యాన్స్‌ చేస్తుండేదాన్ని. ‘ఓ పొల్లా.. ఏం ఎగురుడు.. ఏం ఒర్లుడు సక్కగా సదువుకోక’ అని అమ్మాబాపు అంటుండేవాళ్లు. నా పని నేను చేసుకుంటూ పోతుండేదాన్ని. టెన్త్‌ క్లాస్‌కు వచ్చేసరికి ఏ పాటనైనా సునాయాసంగా పాడేదాన్ని, డ్యాన్స్‌ చేసేదాన్ని. నాకు చదువుతోపాటు కళలపైనా ఆసక్తి ఉందని తొలుత మామయ్యలే గుర్తించిండ్రు.

పాడుతుంటే వినేదాన్ని
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ లక్ష్మి, నాన్న మల్లేశంతో పొలం కాడికి వెళ్లి, పని చేసేదాన్ని. కలువ, కొయ్య వచ్చినోళ్లు యాష్ట రాకుండా ఉండేందుకు మంచి మంచి పాటలు పాడుతుండేవాళ్లు. నాకు ఇదొక మంచి అవకాశం అనుకున్నా. ఎలాంటి పాటలు పాడుతున్నారో, ఎలాంటి పాటలు ఇష్టపడతారో తెలుసుకున్నా. ఒక్కొక్కసారి అమ్మవాళ్లు వద్దన్నా బాయి కాడికి పోయేదాన్ని. ‘ఇంతసేపు పని చేసినట్టు ఉంటది. ఇంకా మంచి పాటలు నేర్చుకోవచ్చు’ అనేది నా ఆలోచన. పాటలకోసమే వెళ్లి పొలం పనులు నేర్చుకున్నా. నాకు నాట్లేయొస్తది. కలుపు తీయొస్తది. చూసేటోళ్లు ‘ఈ జమాన్ల నీలెక్క పొలం పనులకు ఎవలొస్తాండ్రు పిల్లా’ అనేటోళ్లు. ‘ఎంత సదివినా, ఎన్ని విద్యలు తెలిసినా మన మూలం మర్చిపోవద్దు కదవ్వా? మనిషన్నాక అన్ని పనులు వచ్చి ఉండాలె’ అంటుండే దాన్ని.

రెట్టింపైన ఉత్సాహం
పదేండ్ల కిందట మామయ్యలు గల్ఫ్‌ పోయిండ్రు. నాకు ఆశ్చర్యమనిపించేది. వాళ్లు దేశంగాని దేశం బోయినా, అక్కడ పనులల్ల బిజీగా ఉన్నా ఈ పాటలు, పద్యాల గురించే ఆలోచించేటోళ్లు. ఊళ్లె కథలు, పట్నాలు, బతుకమ్మలు జరిగితే వీడియోలు తెప్పించుకునేటోళ్లు. అక్కడికెల్లి మంచి మంచి పాటలు రాసిచ్చి పంపేటోళ్లు. పుట్టిన గడ్డమీద ప్రేమ ఎసొంటిదో వాళ్లను చూస్తెనే అర్థమైంది. నాలో ఉత్సాహం రెట్టింపయింది. యూట్యూబ్‌లో వచ్చే మంచి మంచి జానపదాలు నాకు పంపుతుండేవాళ్లు. తాతవ్వ దగ్గర మంచి మంచి పాటలున్నయని చెప్పిన కదా? వాటిని సేకరించే పనిలో పడిండు చిన్న మామయ్య. ‘సిట్ట సిట్టెండా కొట్టె సెట్టిగురు పెట్టె’ అనే జానపదం నేనుకూడా తాతవ్వ, అమ్మమ్మ దగ్గర చానాసార్లు విన్నా. అత్తగారింటికి పొయ్యిన ఓ కొత్త పెండ్లికూతురు పుట్టింటి గొప్పదనం గురించి అత్తమామలతో చెప్పుకొని ముచ్చట పడే పాటది. మహేందర్‌ మామయ్య సేకరించి పెట్టుకున్నాడు.

మొదటి పాటే హిట్‌
‘సిట్ట సిట్టెండా కొట్టె సెట్టిగురు పెట్టె’ పాటను స్క్రీన్‌మీదికి తీసుకురావడానికి మామయ్య ప్రయత్నం చేసిండు. పరశురామ్‌ మామయ్య చానెల్‌ ‘మానేరు మ్యూజిక్‌’లో ఈ పాటను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ‘బన్నీ! ఇది మన పాట. తాతవ్వ దగ్గర సేకరించుకున్న పాట. నీకు చిన్నప్పటి నుంచి జానపద పాటలు, డ్యాన్స్‌ అంటే ఇష్టం కదా? దీంట్లో నువ్వు యాక్టింగ్‌ చేయాలె’ అన్నారు. అట్లా తొలిసారిగా ఒక జానపద పాటలో నటించే అవకాశం వచ్చింది. ఈ పాట యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యింది. ఇప్పటికి 13 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. డీజే వెర్షన్‌కు అయితే 35 మిలియన్ల వ్యూస్‌ దాటిపోయాయి. నాలో మరింత జోష్‌ వచ్చింది. పాటతోపాటు నాకూ మంచి గుర్తింపు లభించింది. ఎక్కడకి వెళ్లినా ‘సిట్ట సిట్టెండ బన్నీ యాదవ్‌’ అని పిలుస్తున్నారు. దాని తర్వాత అవకాశాలు వెంట వెంటనే వచ్చాయి.

పాటకు రుణపడి ఉంటా
నేను బీకాం కంప్యూటర్స్‌ చదువుతున్నాను. జానపదం పాడటం, పాటకు తగ్గట్టుగా ఆడటం నా అభిరుచి. నేను పెరుగుతున్న కొద్దీ నాలో ఈ అభిరుచి పెరుగుతూ వచ్చింది. కానీ లక్ష్యం మాత్రం వేరే ఉంది. ‘బాగా చదువుకోవాలి, సమాజానికి సేవ చేసే అధికారిణి కావాలి’ అనేది నా కల. పల్లె పదాల ఆట, పాట నా లక్ష్యసాధనలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. అందుకే, పాటకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను.

చిన్నప్పటినుంచీ పాటతో ప్రయాణం చేసినా జీవితలక్ష్యం అదే అనుకోలేదు. మంచిగా చదువుకుని, పోలీసాఫీసర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. సాధిస్తాననే నమ్మకం కూడా ఉంది. ఆడపిల్లలు వంటింట్లోనే కాదు, అన్ని రంగాల్లో రాణిస్తారని నిరూపిస్తా.

‘సిట్ట సిట్టెండ’ తర్వాత ‘బంతి తోట్ల బంతిపూలే రాజమణి’ అవకాశం వచ్చింది. అదికూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘బావొస్తడే’ పాట, ఇటీవల ‘నాయి ఎరుకలి నాగయ్య’ పాటలో అవకాశం వచ్చింది. అన్నిట్లోనూ మంచి పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన.

  • దాయి శ్రీశైలం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిట్ట సిట్టెండా కొట్టె!

ట్రెండింగ్‌

Advertisement