e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ మాట మంచిగుండాలె!

మాట మంచిగుండాలె!

పెద్ద దిక్కు దూరమైతే బతుకు చిల్లంకొల్లమే. ఆశలన్నీ అడియాసలై పోతయి. కానీ, యాదమ్మ బాధను దిగమింగుకుంది. ధైర్యం జేసి, పిల్లలకూ ధైర్యంజెప్పింది. ఊరు పొమ్మన్నా, దారి వద్దన్నా ధైర్యంతోనే నడిచి గెలిచిన యాదమ్మ యాది..

మాట మంచిగుండాలె!

నా పేరు ఎల్గపల్లి యాదమ్మ. మా సొంతూరు శంషావాద్‌ దగ్గర మామిడిపెల్లి. ఏర్‌పోర్ట్‌ పడుట్ల మా భూములు పోయినయి. మేమేమో ఎవుసాయెం చేస్కొని బతికెటొళ్లమాయె. మాతోటిగ పొలాలు పొయ్యినోళ్లు వచ్చిన పైసలతోటి ఇండ్లు, బంగుళాలు కట్టుకొని ఊళ్లెనే ఉన్నరు. మిగిలిన పైసలు బెంకులల్లేసుకొని ఉన్నరు. పుట్టి బుద్ధెరిగినప్పటి సంది మేం పని జేసుకుంటనే బతికినం. పని చేస్తెనే పానం నిమ్మళముంటది. బాయి కాడికి వొయ్యి పొలంల మల్లాడితెనే తిన్న తిండి పెయ్యికి వడ్తది.

కష్టం జేసుకొని బతికెటోళ్లం
నాదంటే అన్ని ఆయెలు సాయెలు తీరినయి. కానీ, మా పిలగాండ్లది ఏమిట్లకేమయ్యింది. ఇప్పటి సంది ఇంట్ల కూసొని తినుకుంటు ఉంటే ఎట్లెళ్తది? కూసొని తింటే కుటుంబాలుకూడా ఒడిశిపోతయి. ఏదన్న పని చేద్దామంటే ఏం పని ఉంటది? మల్లా పోతే ఏర్‌పోర్ట్‌లకే పనులకోవాలె. మా తాననే దినాం ముగ్గురు నలుగురు పని చేసేటోళ్లు. అసొంటిది మనం ఇంకో దగ్గర పనికి వోయి ఏం జేస్తమనుకున్నం. వచ్చిన పైసలతోటి వేరే ఊర్ల భూమి తీస్కుందామని సుట్టుముట్టు ఊర్లల్ల దేవులాడినం. ఒక తాన పొలం దొర్కితే ధర పడదు, ధరవడ్డ దగ్గర పొలం మంచిగుండదు. అట్లా దేవులాడుకుంట పోంగా పోంగా చెవుల పెల్లిల పొలం దొరికింది. పొలం బగ్గనే ఉందిగనీ దూరమైతుందిగా అనిపించింది. కానీ, అవ్వ గావాలె, బువ్వ గావాలె అంటే కుదురదుగా? వొచ్చిన పైసలతోటి ఓ ఇర్వయెకరాల పొలం తీస్కొని ఇక్కడ్నే ఉంటున్నం.

నడిమిట్ల పానం బోయింది
నాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డెలు. పెద్ద కొడుకు ఎవుసాయెం జేస్తడు. నడిపి కొడుకు రాజేంద్రనగర్‌ల కొల్వు చేస్తడు. చిన్న కొడుకుకు ఆటోలున్నయి. ఇద్దరు బిడ్డెలూ రాజేంద్రనగర్‌లనే ఉంటరు. బిడ్డెల పిల్లలు, కొడుకుల పిల్లలూ అందరూ కలుపుకొని ఓ ఇరవై మందిదాకా ఉంటరు. మా ఆయన పేరు సత్తెయ్య. మాకు దూరమయి చానొద్దులాయె. పాపం చానా మంచోడుండె. మంచోల్లను దేవుడు జల్ది తీస్కపోతడంటరుగా, గట్లనే అయ్యింది. అప్పుడు మేం మామిడిపెల్లిలనే ఉంటున్నం. ఊళ్లె మా ఆయనకు మంచి పేరుంటుండె. ఇట్లనే ఏవైనా పంచాదులు, తష్వెలకు పోతుండె. అట్లా ఒకనాడు దినాం బొయ్యినట్టే హోటల్‌కాడ చాయె తాగనీకె పోయిండు. హోటల్ల కూసొని చాయె తాగుకుంటా ఆ ముచ్చటా ఈ ముచ్చటా మాట్లాడుతున్నరు. రోడ్డుమీద మా ఊరోళ్లే ఇద్దరు కొట్లాడుకుంటుండ్రు. ఒకరిమీదికి ఒకరు ఇటికె పెల్లలు, రాళ్లు ఇసురుకుంటుండ్రు. అవి తగిలితే మాత్రం తల్కాయెలు పగుల్తయి. ఎవరో ఉండి ‘అరె అట్ల కొట్టుకుంటుంటె ఇడిపియ్యక తమాశ చూస్తుర్రా పెద్ద మనుషులు’ అని అన్నరంట. ‘అరే ఏం కొట్లాటనయా.. ఏమన్నుంటే కూసొని మాట్లాడుకోవాలెగా’ అని అనుకుంట రోడ్డుమీదికి పోతుంటె ఎట్లకెల్లి వచ్చిందో ఏమోగనీ ఇటికె పెల్ల మా ఆయన తల్కాయెకు తాకనే తాకింది. అట్లనే అడ్డం బడ్డడు. కొట్టుకున్నం, మొత్తుకున్నం. ఎంతకూ లెవ్వలేదు. దవఖానకు తీస్కపోతే ‘పానం బోయింది’ అని చెప్పిండ్రు.

బాధను దిగమింగుకొని..
ఎవనో శని మామీద పడ్డట్టయ్యింది. పెద్ద దిక్కు దూరమైతే సంసారం ఎట్లుంటది? ఏనాడూ నన్ను ఓ దెబ్బ కొట్టినోడు కాదు. ఓ మాటన్నోడు కాదు. పానం లెక్క సూసుకున్నాయిన దూరమవ్వుడు తట్టుకోలేక పోయిన. కానీ, బాధను దిగమింగుకొని సంసారం సాగిచ్చిన. నా పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తమ్ముండ్లను నడిపించిండు. ఎవని తెలివి వానికి చెప్పిండు. అందరూ ఓ పనోళ్లయినంక పెండ్లీలు చేసినం. నాకుగానీ, కొడుకులకుగానీ కొండంత దైర్నం నా పెద్ద బిడ్డె. ఒకరికి పెట్టె చెయ్యెగానీ అడిగే చెయ్యిగాదు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక బిడ్డె. బిడ్డెను మంచిగ సదివించి అమెరిక పంపింది. నా మనుమరాలు అమెరిక వొయ్యిగూడ చానరోజులే అయింది.

మంచిగ చూసుకుంటరు
కొడుకుల దగ్గర కొన్ని రోజులు, బిడ్డెల దగ్గర కొన్ని రోజులు ఉండుకుంట కాలం గడుపుతున్న. నాకైతే ఏ కోడండ్లతోటి పంచాది రాలేదు. ఏ యారాండ్ల తోటి రాలేదు. ఏ ఇయ్యపురాల్లతోటి రాలేదు. మనుమలు, మనుమరాండ్లు కూడా మంచిగ ఉంటరు నాతోటి.
దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాట మంచిగుండాలె!

ట్రెండింగ్‌

Advertisement