అమ్మాయిల వార్డ్రోబ్ ‘మినీ కళామందిర్’ అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్టలకు దీటుగా వెరైటీ పాదరక్షలు కలెక్ట్ చేయడం కూడా ఈ కాలం అమ్మాయిలకు అలవాటే. ఎందుకంటే, మార్కెట్లో షూ ట్రెండ్స్ మారుతున్నాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కొత్త బ్రాండ్‌ని మొదలుపెట్టారు బెంగళూరుకు చెందిన ఆర్తీ చబ్రా, ఆకాంక్ష చబ్రా అనే అక్కాచెల్లెళ్లు. బ్రాండ్ పేరు ‘పాస్టల్స్ అండ్ పాప్’. ఇటీవలే ఈ సోదరీమణులు ‘ప్రామిస్ ఆఫ్ టుమారో’ అనే కలెక్షన్‌ని లాంచ్ చేశారు. వీటిని గత లాక్డౌన్లో బిహార్, పశ్చిమ బెంగాల్ మహిళలతో తయారు చేయించారు. క్లిష్ట సమయంలో ఉపాధి కల్పించి, అనేక కుటుంబాలు రోడ్డున పడకుండా చూశారు. ‘మార్కెట్లో దొరికే షూకు భిన్నంగా మా ఫుట్‌వేర్ ఉండేలా చూస్తుంటాం. ట్రెండ్‌కి తగ్గట్లు రంగులు, మోడల్స్ ఎంచుకొంటాం. ఈ కొత్త కలెక్షన్‌ను ఫ్లోరల్ ప్యాటర్న్, ఎంబ్రాయిడరీతో తయారు చేశాం. ముఖ్యంగా సిల్క్, ఆర్గానిక్ కాటన్, ఆర్గాంజా వంటి ఫ్యాబ్రిక్ వాడాం. గ్లాస్ బీడ్స్, ముత్యాలు, యాంకర్ త్రెడ్స్, రంగురంగుల బీడ్స్‌తో డిజైన్ చేయించాం’ అంటున్నారు చబ్రా సిస్టర్స్. ‘సామాజిక బాధ్యత కారణంగా మా ఉత్పత్తులకు అంతఃసౌందర్యమూ సొంతమైంది’ అంటారామె ఆనందంగా.