మానవ జీవన ప్రయాణ అంతిమ లక్ష్యం ఆనందమే. చేసే పనులను బట్టేకాదు, తీసుకునే ఆహారాన్ని బట్టీ ఆనందం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా ఉంటుందని అధ్యయనాలు నిర్ధారించాయి.
డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీన్నే ‘ఆనంద హార్మోన్’ అనీ అంటారు. డోపమైన్‌తో కూడిన ఆహారం శరీర బరువును తగ్గించడంలోనూ సాయపడుతుంది. పాలు, జున్ను, యోగర్ట్ లాంటి పాల ఉత్పత్తులు.. శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందించే ప్రొబయోటిక్స్కు చిరునామా. ఇవి మన మూడ్‌ను ఆహ్లాదంగా మార్చే డోపమైన్ హార్మోన్‌నూ చైతన్యపరుస్తాయి.
గుడ్లు, అరటిపండ్లు కూడా డోపమైన్ గనులే. ఈ రెండిటిలో ప్రొటీన్లు ఎక్కువ. ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం అంటేనే.. అమైనో ఆమ్లాల ఖజానా అని అర్థం. అమైనో ఆమ్లాల నుంచే డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.
మిఠాయిలంటే నోరూరేవాళ్లు డార్క్ చాక్లెట్ తింటే సరి. ఇందులోని టైరోసైన్ అనే అమైనో ఆమ్లం నుంచి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. పైగా మూడ్‌ను నియంత్రించే సెరోటోనిన్, ఎండార్ఫిన్ హార్మోన్లు డార్క్ చాక్లెట్లో ఉంటాయి.
ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పోలిస్తే, ముడి ధాన్యాలను (హోల్ గ్రెయిన్) ఆహారంగా తీసుకునేవారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపించాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పొట్టు తీయని గింజలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తాజా పండ్లు, బీన్స్, మొలకలు పళ్లెంలో ఉండేలా చూసుకోవాలి.