e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home జిందగీ వివేక..విద్యాలయం!

వివేక..విద్యాలయం!

  • వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌

‘ఇక్కడ భాష నేర్పబడును’‘ఇక్కడ వేషం వేయబడును’‘ఇక్కడ జాతకాలే మార్చబడును’ అంటూ..కొత్తకొత్త ముసుగులు, పైపై మెరుగులు, కాగితం పువ్వు నవ్వులు, టక్కులూ, టక్కుటమార విద్యలూ.. నేర్పించే కోచింగ్‌ సెంటర్లు, బోధించే ఎటికెట్‌ స్కూళ్లు గల్లీకొక్కటి చొప్పున గంపగుత్తగా ఉన్నాయి . ఇవన్నీ బతకనేర్పించే బడులు. కానీ, జీవించడం ఎలాగో బోధించే విద్యాలయాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఆ కొరత తీర్చడానికే ఇరవై రెండేండ్ల క్రితం.. హైదరాబాద్‌, దోమలగూడలోని రామకృష్ణ మఠం ఆవరణలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ ఊపిరిపోసుకుంది.

భయాలతో, అపోహలతో, అనుమానాలతో, ఆత్మన్యూనతలతో అరకొర బతుకు బతుకుతున్న మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌’ శిక్షణ. యోగా, ధ్యానం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌, పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌, వాల్యూ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామ్‌.. పేరు ఏదైనా, మార్గం వేరైనా లక్ష్యం ఒక్కటే – మేధో వికాసం, ఆలోచనా వికాసం, వ్యక్తిత్వ వికాసం.. అంతిమంగా పరిపూర్ణ వికాసం. ఆ ఆవరణ సాక్షిగా మారిన జీవితాలెన్నో. ఏ మాదక ద్రవ్యాల మత్తుకో చిత్తయిపోయి, చిత్త చాంచల్యానికి చేరువలో ఉన్న యువకులు.. ఆ బడి గుడిలో కాలు పెట్టగానే, చీకటి వ్యసనాలను ఛేదించుకొని వెలుతురు మార్గంలో నడిచిన ఉదంతాలు అనేకం! ఆకర్షణలే సర్వస్వమనుకొని, పైపై మెరుగులే నిజమైన వెలుగులనుకొని .. మిణుగురు పురుగులనే నందాదీపాలనుకొని భ్రమలో బతికేస్తున్నవాళ్లు.. ఆ మోహావేశాన్ని బద్దలుకొట్టుకొని లక్ష్యోన్ముఖులైన ఉదంతాలు లక్షలకొద్దీ.

- Advertisement -

ఈ ఇరవై రెండేండ్లలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ ప్రత్యక్షంగా రెండు లక్షల జీవితాలను ప్రభావితం చేసింది. పరోక్షంగా మరికొన్ని లక్షల బతుకులు తీర్చిదిద్దింది. పాశ్చాత్య ధోరణిలో సాగే లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లూ, సక్సెస్‌ సెమినార్ల పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ నిడివి అతి తక్కువ. మహా అయితే కొన్ని రోజులు, కొద్ది వారాలు. కానీ, వివేక విద్యాలయ ప్రభావం.. అపారం, అనంతం. జన్మజన్మాంతరమూ కావచ్చు! ఉత్తమ సంస్కారాలు తోలు తిత్తితోపాటు కుళ్లిపోవు. ఆత్మవెంటే ప్రయాణిస్తాయి.

ఎన్నో కోర్సులు

‘ఈ ప్రపంచమే ఓ వ్యాయామశాల. మనల్ని మనం శక్తిమంతంగా తీర్చిదిద్దుకోవడానికే ఇక్కడికొచ్చాం’ అంటారు స్వామి వివేకానంద. ఆ కసరత్తుకు అవసరమైన సాధన సంపత్తిని వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ అందిస్తుంది. ప్రతి వ్యక్తిని ‘సిక్స్‌ ప్యాక్‌ పహిల్వాన్‌’గా తీర్చిదిద్దుతుంది. ఆ ఆరు ప్యాక్‌లూ.. ఆత్మవిశ్వాసం, విలువలు, ఆరోగ్యం, ఆనందం, లక్ష్యం, సేవాగుణం. ‘ఆర్ట్‌ ఆఫ్‌ మెడిటేషన్‌ ఫర్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌’ కోర్సు మెదడులో నిద్రాణంగా ఉన్న మహాశక్తిని జాగృతపరుస్తుంది. ఒక్కసారి మనలోని భ్రమలు తొలగిపోతే.. ఎరుక ఏరులై పారుతుంది. కౌమార బాలబాలికల ఆలోచనలు పక్కచూపులు చూడవు, ఆకర్షణల వలలో చిక్కుకుపోవు. సర్వోన్నత లక్ష్యమే సర్వస్వం అవుతుంది. ‘ప్రాక్టికల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ కోర్సు నెలరోజుల వ్యవధిలోనే మాటలకు మంత్రశక్తిని జోడిస్తుంది. ఆ తర్వాత, ప్రతి పలుకూ ఒక పాశుపతమే. ‘స్టెప్స్‌ టు బిల్డ్‌ సెల్ఫ్‌-డిఫెన్స్‌’ కోర్సు సంక్షోభాలు ఎదురైనా కుంగి పోకుండా, నిలిచి గెలిచే మనోబలాన్ని ప్రసాదిస్తుంది. ‘పేరెంటల్‌ మోటివేషన్‌ కోర్స్‌’ అచ్చంగా కన్నవాళ్ల కోసమే. మాతృ-పితృ దేవోభవకూ, ఆచార్య దేవోభవకూ మధ్య ఉన్న అంతరాన్ని దూరం చేస్తుంది. తొలి గురువులకు తొలి వందనం సమర్పిస్తుంది. పసి మనసులలో సంస్కార బీజాన్ని నాటే పరమ లక్ష్యంతో ప్రారంభమైంది ‘వివేకానంద బాల వికాస కేంద్ర’. ఒకటేమిటి, మనిషిని మహోన్నతుడిని చేయడానికి అవసరమైన సాధన , సంపత్తి.. రామకృష్ణ మఠం ఆవరణలో పుష్కలం.

‘ఇసుకనూ, చక్కెరనూ కలిపి పెట్టినా చీమ చక్కెరనే తీసుకుంటుంది. ఇసుక రేణువు వైపు కన్నెత్తి కూడా చూడదు. చీమలపాటి వివేకం కూడా మనకు లేకుండా పోయింది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక పోతున్నాం’ అనేవారు పరమహంస.
సత్యామృతే మిధునే కృత్య
సర్వోయం లోక వ్యవహారకః

అంటుంది బ్రహ్మసూత్రం.సత్యం, అసత్యం కలిసిపోయి ఉంటాయి. రెండిటినీ విడదీసి చూడటానికి, పాలూ నీళ్లలా వేరుచేయడానికి.. ఐఐటీ పట్టాలూ, ఐఐఎమ్‌ డిగ్రీలూ సరిపోవు. సాఫ్ట్‌వేర్‌ కొలువులూ, డాలర్ల జీతాలూ పనికిరావు. బ్యాంక్‌ బ్యాలెన్సులూ, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులూ కొరగావు.వివేకం ఉండాలి. వివేకమే కావాలి.వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ జాగృతం చేసేది కూడా మనిషిలోని ఆ వివేకాన్నే!

కార్పొరేట్‌ జీవితం ట్రెడ్‌మిల్‌ మీద పరుగులాంటిది. పరుగెత్తినట్టే ఉంటుంది, కానీ ఉన్నచోటనే ఉంటాం. ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది, పాతాళంలో కూరుకుపోతుంటాం. ఆరోగ్యంగానే కనిపిస్తాం, కానీ లోలోపల తనువూ, మనసూ శిథిలమైపోతుంటాయి. అందుకే, వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ ఇంజినీర్లకూ, కార్పొరేట్‌ ఉద్యోగులకూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌, ధ్యానం ద్వారా ఒత్తిడిని తట్టుకోవడానికి సరిపడా
మనోబలాన్ని ఇస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana