పెండ్లి పేరంటాల్లో ప్రత్యేకంగా కనిపించా లని ఏ మగువకైనా ఉంటుంది. ఆ ఆకర్షణకు అలంకరణే మార్గం. ఆభరణాలను మించిన ఆకర్షణ ఏం ఉంటుంది? అందులోనూ, రాజస్థానీ మీనాకారి నగల అయస్కాంత శక్తికి తిరుగే లేదు. ఆపాదమస్తకం ధరించే ఆభరణాలతో పాటు పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్లు కూడా మీనాకారి సొబగులద్దుకుంటున్నాయి.
రాజస్థాన్.. మీనాకారి నగల పుట్టిల్లు. ఈ పంచవన్నెల ఆభరణాలకు ప్రపంచమంతా అభిమానులున్నారు. ముదురు రంగులను ఇష్టపడేవారికి రంగుల హరివిల్లును తలపించే మీనాకారి నగలు చక్కగా నప్పుతాయి. జాతిరాళ్లను వివిధ రంగుల ఎనామిల్‌లో అమర్చడం ఈ నగల ప్రత్యేకత. పేరుకు స్వర్ణాభరణాలే అయినా, కనిపించేది మాత్రం ఎనామిల్ వర్ణాలే. ఆకులు, పక్షులు, నెమళ్లు, పూలు, తీగలు, చేపలు, ఏనుగులు .. ఇలా ప్రకృతి సౌందర్యమంతా నగల్లో ఇమిడిపోతుంది. కుందన్ నగల అడుగున మీనాకారి డిజైన్లు రూపొందిస్తే వాటిని రెండువైపులా వాడుకునే వీలుంటుంది.
డిజైనర్లు ఆ పనిమీదే ఉన్నారిప్పుడు.
మూడు రకాలు..
రాజస్థానీ మీనాకారి నగల్లో మూడు రకాలుంటాయి. ఒక రంగును మాత్రమే వాడి తయారుచేసేవి.. ‘ఏక్రంగ్ ఖులామీనా’. ఈ నగల అంచుల్లో మాత్రమే బంగారం కనిపిస్తుంది. మిగతా నగంతా ఒకే రంగుతో డిజైన్ చేసి ఉంటుంది. ఆకుపచ్చ, లేత నీలం, ముదురు నీలం, తెలుపు, ఎరుపు రంగులతో తయారుచేసే నగలను ‘పంచ్రంగి మీనా’ అంటారు. గులాబీ రంగును మాత్రమే వాడే నగలు ‘గులాబీ మీనా’. గులాబీ మీనాకారి నగలకు వారణాసి ప్రసిద్ధి.
సరళం.. సుందరం
మీనాకారి నగలను అలంకరించుకొంటే సంప్రదాయ సౌందర్యంతో పాటు, రాచరికపు హుందాతనమూ సొంతం అవుతుంది. కుందన్లు, రాళ్లతో మీనాకారి సొగసులద్దిన ఆధునిక ఆభరణాలు సింపుల్‌గానే కాదు, ైస్టెలిష్గానూ కనిపిస్తాయి. నవరత్నాలకు జతగా చేరే ఆకర్షణీయమైన రంగులు ఈ నగలకు మరింత అందాన్నిస్తాయి. ఇక, చీరకట్టు తోడైతే కనికట్టూ చేయగలవు. స్కర్ట్స్, క్రాప్ టాప్స్, ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్ వంటి వెస్ట్రన్ వేర్పైనా చక్కగా నప్పుతాయి. అందులోనూ ఈ చెవి జూకాలు, సంప్రదాయ లెహెంగా మీద వేసుకునే ఆక్సిడైజ్డ్ సిల్వర్ నగలకు సరిజోడి!
బుట్టాలు ప్రత్యేకం..
కంఠాభరణాలు, చెవి దుద్దులు, బుట్టాలు, లోలాకులు, గాజులు.. ఇలా అన్ని నగలకూ మీనాకారి సొగసులద్దుతున్నారు. చెవి కమ్మలు, నెక్లెస్‌లు, హారాలు, పాపిట బిళ్లలు.. సెట్లుగాను, విడిగానూ అందుబాటులో ఉన్నాయి. రంగురంగుల దుస్తులమీదికి నప్పేలా ఆయా వర్ణాల్లో మెరిసే మీనాకారి బుట్టాలు ఎప్పుడూ ఫ్యాషనే. వీటిలోనూ పెద్దగా, బరువుగా, నిండుగా కనిపించేవి ఒకరకం అయితే.. పార్టీలు, ఫంక్షన్ల కోసం కుందన్లు, రాళ్లు పొదిగి తయారుచేసేవి మరో రకం. అచ్చంగా చీర మీదున్న పువ్వులు, లతలు, బుట్టల డిజైన్లను నగల్లోనూ పొదిగి చక్కని మ్యాచింగ్ ఆభరణాలను చేస్తున్నారు.