రకరకాల వంటలను నిమిషాల్లో చేసెయ్యడం అమ్మలకే సాధ్యం. ఇదే మాటను మరోసారి రుజువు చేశారు మదురైకి చెందిన ఇందిరా రవిచంద్రన్. పదంటే పది నిమిషాల్లో వంట చేసి, పిల్లలకు లంచ్ బాక్సులు సర్దడం ఆమెకు మొదటి నుంచీ అలవాటే. ఆ వేగాన్ని గమనించిన ఆమె భర్తకు ఓ ఆలోచన వచ్చింది. అదే ఇప్పుడు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇందిరా రవి చంద్రన్ పేరు నిలబడి పోయేలా చేసింది. ఇటీవలే ఆమె, సరిగ్గా 30 నిమిషాల్లో 134 వంటలు చేసి రికార్డు సాధించింది. గతంలో కేరళకు చెందిన 17ఏండ్ల కుర్రాడు గంటసేపట్లో 172 వంటలు చేసిన రికార్డు ఉంది. నిజానికి, అర గంటలో 87 వంటలు చేసినా, రికార్డు ఆమె సొంతమయ్యేదే. కానీ పట్టుదలతో 134 వంటలు వండేసింది. ‘గత మూడు నెలలుగా పక్కన వాచీ పెట్టుకుని, ఎంత సేపట్లో, ఎన్ని వంటలు చేయగలననే దానిపై దృష్టిపెట్టాను. మొదట్లో అరగంటకు 36 వంటలే కుదిరాయి. సాధన చేస్తున్నకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పూర్తి నమ్మకం వచ్చాకే రంగంలోకి దిగాను. ఇప్పుడు 134 వంటలు చేసి, లక్ష్యాన్ని దాటి ముందుకు వెళ్లడం సంతోషంగా ఉంది’ అంటున్నది ఇందిరమ్మ. రికార్డు కోసం ఆమె ఎంచుకున్న వంటల్లో కప్ కేక్స్, ఇడ్లీ, రకరకాల వడలు, పకోడీలు, ఖీర్, పాయసం, రైతా, శాండ్విచ్, సలాడ్, కోడికూర, బిర్యానీ మొదలైనవి ఉన్నాయి.