ఆదివారం అరటి మొలిచిందంటూ గేయరూపంలో వారాల వివరాలు చదువుకున్నాం. నగ నిగల్లోనూ వారాల సంగతులు ఇమిడి ఉన్నాయి. ఖరీదు ఎక్కువే అయినా, వారానికో హారం నవరత్నాల ఘనతను చాటుతుంది. ఆ రోజుకు గ్రహరాజు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆదివారం మొదలు శనివారం వరకు రోజుకో రకం ఆభరణాలను ధరించే సంప్రదాయం తరాలనుంచీ ఉంది. భారతీయ మహిళ సాధించుకున్న ఏడు వరాలు.. ఏడు వారాల నగలు.
నగకు పర్యాయపదాలు అనేకం. హారం, ఆభరణం, భూషణం, సొమ్ము.. ఇలా చెబుతూ పోతే ఏడు వారాలూ గడిచిపోతాయి. ఈ జాబితాలోకే వస్తాయి ఏడువారాల నగలూ. చక్రవర్తుల కాలం నుంచీ ఏడు వారాల నగలు మన కట్టుబొట్టులో భాగమయ్యాయి. ఒకప్పుడు రాణులు, రాజమాతలు రోజొక్క తీరు నగలు ధరించేవారు. రానురాను ఆ సంప్రదాయం సంపన్న కుటుంబాలకూ చేరువైంది. రత్నశాస్త్రం పరంగా చూసినా.. ఏడు రోజులకు అధిపతులైన ఏడు గ్రహాల అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఏరోజుకారోజు జాతిరత్నాలతో తీర్చిదిద్దిన నగలు ధరించడం మంచిదే.
ఆదివారం
ఐతారానికి అధినాయకుడు సూర్యుడు. ఆదిత్యుడి అనుగ్రహం పొందడానికి ఆదివారం అనువైన రోజు. అందుకే, ఈ రోజు భాస్కరుడి రత్నంగా చెప్పే కెంపులు పొదిగిన నగలు ధరిస్తారు. కెంపు సొంపుల హారాలు, వంకీలు, ఉంగరాలు అలంకరించుకొని సూర్యారాధన చేస్తారు.
సోమవారం
చల్లని చంద్రుడి వారం సోమవారం. చల్లదనానికి ప్రతీకగా నిలిచే ముత్యాల హారాలు ఈ రోజు ధరిస్తారు.
మంగళవారం
మంగళ ప్రదమైన ఈ వారానికి అధిపతి కుజుడు. భౌముడి రత్నాలైన పగడాలు పొదిగిన నగలను ధరిస్తే కుజుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
బుధవారం
బుధుడు బుద్ధిని ప్రేరేపిస్తాడని శాస్త్రవచనం. సద్బుద్ధి కోరుతూ సౌమ్యుడి రత్నమైన పచ్చ ధరిస్తారు. ఏడు వారాల్లో నాలుగో వారం బుధుడి అనుగ్రహం ఆకాంక్షిస్తూ పచ్చల పేర్లు,
పతకాలు, గాజులు అలంకరించుకొంటారు.
గురువారం
బృహస్పతికి ఇష్టమైన రత్నం పుష్యరాగం. పరిపూర్ణ శుభగ్రహంగా పేర్కొనే గురువు అనుగ్రహం కోరుతూ కనక పుష్యరాగాలు, శ్వేత పుష్యరాగాలు పొదిగిన ఉంగరాలు, కమ్మలు ధరిస్తారు.
శుక్రవారం
శుక్రుడు కళత్ర కారకుడు. అంటే జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తాడు. కలకాలం నిల్చుండిపోయేలా బంధాన్ని బలోపేతం చేస్తాడు కనుక, ఆయన రత్నమైన.. కలకాలం నిలిచిపోయే వజ్రాభరణాలను శుక్రవారం ధరిస్తారు.
శనివారం
శనైశ్చరుడు ఆయుష్షును ప్రసాదిస్తాడు. శనిదోషాలుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శని అనుగ్రహం కోరుతూ నీలం ధరిస్తారు. అందుకే శనివారం నీలమణులతో తయారైన ఆభరణాలు అలంకరించుకొంటారు.
సంప్రదాయ ప్రతీక
పండగలు, పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ధరించే సంప్రదాయ వస్త్రశ్రేణి పైకి ఈ ఆభరణాలు బాగా సెట్ అవుతాయి. ముఖ్యంగా పెద్దపెద్ద హారాలు, వడ్డాణం, వంకీలు, ముక్కుపుడకలు, గాజులది ప్రత్యేక స్థానం. ధరించిన దుస్తులకు నప్పే విధంగా కెంపులు, పచ్చల హారాలు ఎంచుకొని సంప్రదాయంతోపాటు ఫ్యాషన్‌ని కూడా ఫాలో అవుతున్నారు ఆధునిక అతివలు. చీరలు, చుడీదార్లమీదే కాకుండా లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తుల మీదికికూడా జాతిరత్నాలు పొదిగిన సన్నని గొలుసులు, ఉంగరాలు, కమ్మలు అందుబాటులో ఉంటున్నాయి. ఏ దుస్తులు వేసుకున్నా చేతినిండా గాజులు ఆల్‌టైమ్ ఫ్యాషన్ కాబట్టి అన్ని రకాల రత్నాలు పొదిగిన గాజులవైపు మొగ్గు చూపుతున్నారు.
ఒక్కో నగకి ఒక్కో ప్రత్యేకత
ఈ ఏడు వారాల నగల్లో చాలా నగలుంటాయి. కాసుల పేరు, పచ్చల హారం, ముత్యాల హారం, కెంపుల నెక్లెస్.. ఇలా అనేక నగలు పలు ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఆలయాల్లోని దేవతామూర్తులకు సమర్పించే నగల్లోనూ ఏడు వారాల నగలకెంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పుడివే నగలు టెంపుల్ జువెలరీ పేరుతో ఆధునిక యువతుల మనసును దోచేస్తున్నాయి. ఈ నగల్లో ఎక్కువగా బంగారంతో చేసినవే ఉంటాయి. బంగారాన్ని ధరించడం అదృష్టానికి ప్రతీకగా భావించే, చాలామంది ఏడు వారాల నగలు చేయించి లాకర్లో భద్రపరుచుకుంటారు. కొందరు, రోజుకో రకం నగలు ధరిస్తే మరికొందరు అన్ని నగలనూ ఒకేసారి ధరించి మురిసిపోతారు.