e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home జిందగీ అమ్మా.. ఇందిరమ్మా!

అమ్మా.. ఇందిరమ్మా!

అమ్మా.. ఇందిరమ్మా!

జీవితం మనదే. కానీ, స్క్రిప్ట్‌ ఎవరో రాసినట్లు కనిపిస్తుంది. ఇంకెవరో డైరెక్షన్‌ చేస్తున్నట్లు అనిపిస్తుంది. వేరెవరో స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నట్లు సాగుతుంది! అలాంటి ఓ కథే ఇందిరమ్మ జీవితం. ఆమె కాలపు కదలికల యాది..
మనం ఒకటనుకుంటం, జరిగేది ఇంకొకటి ఉంటది. ఒకరు ఆడిస్తే ఆడాలె తప్పితే, మనం ఆడించేది ఏమీ ఉండదు. నా పేరు ఇందిరమ్మ. మా తల్లిగారి ఊరు శంషాబాద్‌ దగ్గర శంకర్‌పురం. మా అమ్మ, నాయిన కల్లుగీసి అమ్ముతుండేది. రంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన చింతాకుల పాపయ్యకు మనువొచ్చిన. నేను కట్టుకోక మునుపే ఆయనకు పెండ్లయి ఒక కొడుకున్నడు. అయితే, ఆమె కాలం చేసిందంట. అప్పటికి కొడుకు ఐదారేండ్లు ఉంటడంతే.
కొడుకొచ్చినంకనే తిండి
మా ఆయన కల్లు గీస్తెనే ఇంట్లకు ఎల్లేది. నా కడుపున పుట్టకపోయుండొచ్చు. నేను నా కొడుకుకు చనువాలు ఇయ్యక పోయుండొచ్చు. కానీ, ఆ ఇంటి గడప తొక్కుడుతోటే వాడు నాకు కొడుకయ్యిండు. నేను వాడికి తల్లినయ్యిన. తల్లి లేని పిలగాడు అనే మాటనే రావొద్దని మంచిగ చూసుకున్నా. వాళ్లమ్మ పెట్టిన పేరు నరేశ్‌. నేను రాజు అని పెట్టుకున్నా. కొడుకెక్కడికైనా బైటకి పోతే ‘రాజూ’ అని కూతేస్తే సుట్టుముట్టోళ్లు ‘అగో ఇందిరమ్మ కొడుకును ఒక్క నిమిషం గూడా బైటికి పోనియ్యదురయ్యా’ అనుకునేటోళ్లు. మా ఆయన పొద్దుగాల లేవంగనే తాళ్లళ్లకు పోతుండె. నేను వంటపనీ, ఇంటిపనీ చేస్తుండేదాన్ని. బడి ఇంటి పక్కనే ఉంటుండె. నా కొడుకు బడికి పోంగనే నేను మా ఆయనకు అన్నం తీస్కొని కల్లు మండువ కాడికి పోతుంటి. మల్లా పగటీలి రెండు గంటల కల్లా ఇంటికొద్దుము. ఇంత తిని అడ్డమొరిగి, మల్లా మా ఆయన మాపటికల్లు గీస్తందుకు పోతుండె. ఇగ నేను ఇంట్లనే ఉండి ఆ పనీ, ఈ పనీ చేసి కొడుకు రాంగనే కలిసి తిందుము.
వెళ్లి పొమ్మన్నరు
‘అమ్మా’ అని కడుపు నిండా నా కొడుకు పిలుస్తుంటే ఇక సాల్రా జీవితం అనిపించేది. చేసుకున్నకాడికి తిండికి, బట్టకు మంచిగనే వెళ్తుండె. కానీ ఇంతల్నే యెమినోడు సొచ్చిండు మా యింట్ల. మా ఆయన తాటి మీదికెల్లి కిందవడ్డడు. కొట్టుకున్నా, మొత్తుకున్నా పోయిన పానం తిరిగి రాలేదు. పోరడు చూస్తే చిన్నోడు. నేను చూస్తే మందికి తిక్కల్దాన్ని. ఏంజేసుడు? ఎట్లజేసుడు? ‘నువ్వు కనుకున్న కొడుకా? నీ కడుపున పుట్టిన బిడ్డెనా? నిన్ను జేసుకున్నోడే పోయిండు. ఈడ ఉండి ఏంజేస్తవమ్మా. అమ్మగారింటికి పో’ అన్నరు. ఆ మాటలు, ఈ మాటలు నా దిమాక్‌ సుట్టూ చేరినయి.
ఇందిరమ్మ కొడుకుగా
నేను కట్టుకున్నోడు పోయిండు. నిజమే. కానీ ఈ పోరగాన్ని విడిశి నేనెళ్లిపోయి ఏం సాధిస్త? వాడు కడుపు నిండా ‘అమ్మా’ అని పిలుస్తుంటె ఎంత సంబురమైతదో నాకు తెలుసు. ‘అందరికీ చెప్పేసిన. సచ్చిందాకా ఈడనే ఉంటా. నా కొడుకును ఓ పనోన్ని చేసి, వాని పిల్లలతోటి నాయినమ్మా అనిపించుకుంటా. నాకు ఎవరూ ఏమీ చెప్పొద్దు’ అన్నా. ‘నేను తెల్విదక్వదాన్నే కావచ్చు. కానీ కొడుకును దూరం చేసుకునేంత తెల్విదక్వదాన్ని కాదు’ అని, ఆనాటి సంది కొడుకే ప్రపంచంగ బతికిన. ‘నా అమ్మ నా కోసమే బతుకుతుంది’ అని నా కొడుకు తెల్వికొచ్చినంక నన్ను ఏ పనీ చెయ్యనీయలేదు. మంచి పని చూసుకున్నడు. ఇల్లు కట్టుకున్నడు. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నడు. పిల్లలైండ్రు. ఎవ్వరూ వేలువెట్టి సూపించకుండా ‘ఇందిరమ్మ కొడుకు’గా బతుకుతుండు. నన్ను మంచిగ చూసుకుంటుండు.

Advertisement
అమ్మా.. ఇందిరమ్మా!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement