రైతమ్మే..వ్యాపార రాణెమ్మ!

రైతే.. రాజు కావచ్చు, కాకపోవచ్చు. కానీ, వ్యాపారిగా మాత్రం మారాల్సిందే. మార్కెట్ కోణంలో ఆలోచించాల్సిందే. వినియోగదారుల మనస్తత్వాన్ని, అవసరాలను అర్థం చేసుకోవాల్సిందే. అదే జరిగితే, లాభాల పంటే! జహీరాబాద్ మహిళా రైతులే ఇందుకు సాక్ష్యాలు. కుసుమ నూనె తీయడం నుంచి చాక్లెట్ల్ల తయారీ వరకూ వాళ్లకు రాని విద్యంటూ లేదు.
ఎన్నిసార్లు నడిచినా తనివి తీరని మట్టి పరిమళపు ఎర్రనేలలు, జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)లో విస్తారంగా ఉన్నాయి. వేలాది మహిళా రైతులు ఇక్కడ మెట్ట పంటను ఒక ఉద్యమంగా సాగు చేస్తున్నారు. విత్తనాలూ ఎరువులతో సహా సాగుకు అవసరమయ్యే ప్రతి వస్తువునూ స్థానికంగానే తయారు చేసుకుంటారు. కుసుమ గింజలను పండించడంతోనే ఆగిపోవడం లేదు. బడా కంపెనీలకు మాత్రమే సాధ్యమయ్యే ఆర్గానిక్ వంట నూనెను తీస్తున్నారు. చాక్లెట్లనూ, రొట్టెలనూ తయారు చేస్తున్నారు.
జహీరాబాద్ చుట్టూ విసిరేసినట్టుండే ఎల్గోయి, రేజింతల్, జీడిగడ్డ, పస్తాపూర్, గొడ్డిగార్ పల్లి, ఖాసింపూర్, పొట్పల్లి, చిలుకపల్లి తదితర గ్రామాల్లో సుమారు 5వేల మంది మహిళలు రెండు దశాబ్దాలుగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. వర్షాధారంపైనే తెల్ల కుసుమలు, రాగులు, కొర్రలు, జొన్నలు వంటి కరువు పంటలను పండిస్తున్నారు. అప్పట్లో, జహీరాబాద్ మండలంలో దాదాపుగా అపరాలే సాగు చేసేవారు. అయినా, పెద్దగా గిట్టుబాటు అయ్యేది కాదు. ఈ నేపథ్యంలో సాగుబడిని సుసంపన్నం చేయడానికి మహిళా రైతులతో వైవిధ్యమైన పంటలకు శ్రీకారం చుట్టింది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఆ ప్రయోగ ఫలితాలే ఇవన్నీ.
ఇంటి అవసరాల తరువాతే...
‘మా సొంత విత్తనాలతో సంప్రదాయ పద్ధతుల్లో కుసుమలను పండిస్తున్నాం. ఆ గింజలతో గానుగ నూనె కూడా తీస్తున్నాం. ఇంటి అవసరాలకు వాడుకోగా మిగతాది మార్కెట్ చేస్తున్నాం’ అంటారు తెల్ల కుసుమలు పండిస్తున్న పొట్పల్లి గ్రామస్థురాలు మొగులమ్మ. మన ఆత్మీయులో, పిల్లలో తినే పదార్థాలను శ్రద్ధతో వండుతాం, అంతే ప్రేమగా పండిస్తాం. దీంతో, మరింత నాణ్యత సాధ్యం అవుతుంది. వ్యాపారులు ఒక రూపాయి ఎక్కువ పెట్టి అయినా, కొనడానికి సిద్ధపడతారు. ఫలితంగా గిట్టుబాటు ధరలు లభిస్తాయి.
చిరుధాన్యాల రుచులు
‘ఒకే రకం పంటలు వేయడం వల్ల భూమి చవుడు బారుతుంది. చీడపీడలు ఆశిస్తాయి. అందుకే, పంటల మార్పిడిని అనుసరిస్తున్నాం. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరుగుతుంది. అలా పండించిన రాగులతో లడ్డూలు, సజ్జలతో చాక్లెట్లు తయారు చేస్తున్నాం’ అంటున్నారు చంద్రమ్మ. మార్కెట్లో దొరికే కొన్నిరకాల చాక్లెట్లను అతిగా తింటే ఊబకాయం రావచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు వాటి జోలికి వెళ్లకుండా, ఆరోగ్యకరమైన చిరుతిండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు తల్లిదండ్రులు. పెండ్లిళ్లకూ, ఫంక్షన్లకూ మహా రుచికరమైన రొట్టెలు తయారు చేసి సరఫరా చేస్తున్నారు ఈ మహిళలు.
ఆర్గానిక్ నూనె
‘ఒక ఉద్యమంలా కొన్ని దశాబ్దాలుగా చిరుధాన్యాలను సాగు చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్), ఇపుడు మహిళా రైతులు పండించిన పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయిస్తున్నది. మనం తినే ఆహారంలో నూనెలే కీలకం. దురదృష్టవశాత్త్తు మార్కెట్లో నాసిరకం నూనెలే ఎక్కువ. వాటికి ప్రత్యామ్నాయంగా మేము, సంప్రదాయ చెక్క గానుగతో తయారైన.. స్వచ్ఛమైన ఆర్గానిక్ నూనెను అందుబాటులోకి తెస్తున్నాం. ఇది కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. చిన్నారులకు ఇష్టమైన మల్టీమిల్లెట్ న్యూట్రీ బార్లను కూడా కొర్రలతో తయారు చేస్తున్నాం’ అంటున్నారు సొసైటీ డైరెక్టర్ పి.వి సతీష్. కుసుమ నూనెలో 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరుగదు. దీంతో మార్కెట్లో గిరాకీ పెరిగింది.
మిల్లెట్ చాక్లెట్
బజార్లో దొరికే రకరకాల చాక్లెట్ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలో మహిళలు రాగులు, బెల్లం,కొర్రలతో మల్టీమిల్లెట్ న్యూట్రీ బార్లను తయారు చేస్తున్నారు. వీటిలో పోషక విలువలు అపారం. పిల్లల్లో రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డీడీఎస్ ద్వారా వీటిని హైదరాబాద్‌లో నగర ప్రజలకూ విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులూ ఇష్టంగా కొంటున్నారు. ఆత్మీయులకు కానుకలుగా కూడా ఇస్తున్నారు. ఆ కస్టమర్ల ఖాతాలో బహుళజాతి సంస్థల ఉన్నతోద్యోగులూ ఉన్నారు.
శ్యాంమోహన్
తాజావార్తలు
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?
- విద్యాసంస్థల 'వాణి'ని వినిపిస్తుంది..