శనివారం 16 జనవరి 2021
Zindagi - Dec 03, 2020 , 00:08:05

యవ్వనం

యవ్వనం

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక  వ్యాపారి ఉండేవాడు. అతను చాలా అందంగా ఉండేవాడు. ఊర్లో  అందరూ అతడిని మెచ్చుకొనేవారు. ఆ పొగడ్తలు విని ఆ  వ్యాపారిలో గర్వం పెరిగింది. వయసు పెరిగే కొద్ది అతని చర్మం మీద ముడతలు రావడం మొదలైంది. ఒక రోజు అద్దంలో చూసుకుంటే కండ్ల కింద నల్ల చారలు, మొహం మీద పెద్దపెద్ద ముడతలు కనిపించాయి. నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఏమైనా చేయాలని అనుకున్నాడు.  ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయం అడిగాడు. ఆ తాంత్రికుడు  వ్యాపారికి ఒక అద్దం ఇచ్చాడు. ‘రోజూ ఈ అద్దంలో చూసుకో.. నీకు వయసుతో పాటు రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో కనిపిస్తాయి. నువ్వు మాత్రం ఎప్పుడూ యవ్వనంలోనే ఉండిపోతావు. అయితే,  ఒక్క విషయం ... నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ ప్రతిబింబం అంత బాగా ఉంటుంది. నీవు చేసే ప్రతి చెడు పనీ నీ ముఖం మీద ముడతై కనిపిస్తుంది, అదీ అద్దంలోనే సుమా! బయటకు మాత్రం కనిపించదు’ అని హెచ్చరించాడు. అద్దం తీసుకుని వ్యాపారి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. రోజూ అద్దంలో తన యవ్వనాన్ని  చూసి సంబురపడేవాడు. కానీ చెడు పనులు చేయడం మాత్రం మానలేదు. ఆ పనులన్నీ చర్మం మీద ముడతలై అద్దంలో మాత్రమే కనిపించేవి.  దీంతో తన ముసలితనం అంతా అద్దానికే పరిమితం అయిందనీ, బయట మాత్రం యవ్వనంగానే ఉన్నాననీ అనుకునేవాడు. కొంత కాలానికి అద్దంలో మొహం చాలా ముడతలతో కనిపించసాగింది.  భరించలేనంత అసహ్యంగా తయారైంది. తనను వికారంగా చూపిస్తున్న అద్దంపై తీవ్రమైన కోపం వచ్చింది. భరించలేక అద్దాన్ని నేలకు కొట్టాడు. అది ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది. తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, వయసు మళ్ళిన వృద్ధుడు కనిపించాడు.  అతనే ఆ వ్యాపారి! ఆ  వ్యాపారి  నిద్రలేచి, తన శరీరాన్ని చూసుకుని,  తను చేసిన తప్పులు తలుచుకుంటూ కుమిలి పోయాడు. 

నీతి   

బయటకు కనబడటం లేదని తప్పులు చేయవద్దు. వాటి పర్యవసానాలు భవిష్యత్తు మీద కచ్చితంగా ప్రభావం చూపుతాయి.