శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 06, 2021 , 02:14:01

సుఖ ప్రసవానికి గర్భయోగా

సుఖ ప్రసవానికి గర్భయోగా

పురిటి నొప్పుల భయం.. బీపీ పెరుగుతుందేమోనన్న ఆందోళన.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా లేదా అనే సందేహం... ఇవేవీ అక్కర్లేదు. గర్భం దాల్చడానికి ముందే యోగ సాధన మొదలుపెడితే ఎన్నో ప్రయోజనాలు. నొప్పులు భయపెట్టవు. బీపీ నియంత్రణలో ఉంటుంది. సిజేరియన్‌ బాధ లేకుండా నార్మల్‌ డెలివరీ అవుతుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మిగతా పిల్లలతో పోలిస్తే చురుగ్గానూ కనిపిస్తుంది. ‘ప్రెగ్నెన్సీ యోగా’తో ఇవన్నీ సాధ్యమేనంటున్నారు యోగా గురువులు. 

యోగా అంటే మనసు, శరీరం, ఆత్మల 

కలయిక. యోగ సాధన చేస్తున్నప్పుడు ఈ మూడింటి సమ్మేళనంతో ఆధ్యాత్మికమైన, ఆరోగ్యపరమైన సత్ఫలితాలు వస్తాయి. ఏ జబ్బు చేసినప్పుడో యోగా గురించి ఆలోచించడం కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధనలోకి వస్తే జబ్బులను మూలాల నుంచే నివారించవచ్చు. నిత్యం యోగాసనాలు వేయడం వల్ల శరీరం స్థిరమవుతుంది. ప్రాణాయామ, ధ్యాన సాధనతో మనసు ప్రశాంత స్థితిలోకి వస్తుంది. ఒత్తిళ్లు, అలజడులు లేని వాతావరణంలో శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు అందుతుంది. 

ఆరోగ్యవంతమైన బిడ్డకోసం..

గర్భం దాల్చడమంటే కొత్త తరానికి బీజం వేయడమే. ఈ దశలో చేసే యోగ సాధన ఇటు తల్లికీ, అటు కడుపులోని బిడ్డకూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నిజానికి, గర్భం దాల్చకముందే యోగ సాధన మొదలుపెడితే మరింత ఉపయోగం. దీనివల్ల గర్భం ధరించేందుకు అవసరమైన గ్రంథులు బాగా పనిచేస్తాయి. అవి గర్భం నిలవటానికి సహకరిస్తాయి. అంతేకాదు, గర్భధారణ సమయంలో  శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు కలుగుతాయి. వీటన్నిటినీ తట్టుకునేలా శరీరంలోని కణాలన్నీ సమాయత్తమవుతాయి. గర్భానికి ముందే యోగ సాధన ప్రారంభిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి, మానసిక ప్రశాంత స్థితిలో భార్యాభర్తల కలయిక జరిగినప్పుడు పిండానికి ఆరోగ్యకరమైన జన్యువులు అందుతాయి. దాంతో, జన్మతః వచ్చే రోగాల నుంచి పుట్టబోయే బిడ్డను కాపాడుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. 

గర్భంతో ఉన్నప్పుడు...

గర్భం దాల్చగానే యోగా మొదలుపెట్టకూడదు. మొదటి రెండు నెలలు వాంతులు, చికాకులు ఉంటాయి. యోగసాధనకు శరీరం సహకరించదు. పిండం గర్భంలో నిలిచిన తరువాత, నాలుగో నెల నుంచి సాధన మొదలుపెట్టి, ప్రసవం వరకూ కొనసాగించవచ్చు. అయితే ఎప్పుడు, ఎలా, ఏం చేయాలనే విషయంలో గర్భ యోగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గర్భవతులు  ప్రత్యేకమైన యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ సాధన చేయాల్సి ఉంటుంది.  వారి ఆరోగ్య స్థితిని బట్టి యోగా నిపుణులు వివిధ ఉపకరణాలతో సాధన చేయిస్తారు. కుర్చీలు, గోడ, దారం తదితర వస్తువుల సహాయంతో యోగా ఎలా చేయాలో నేర్పుతారు. గర్భంలోని బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా, పొట్టపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక ఆసనాలను రూపొందిస్తారు. నెమ్మదిగా చిన్న చిన్న కదలికలతో సాధన మొదలుపెట్టి.. సూర్య నమస్కారాలు, క్రమబద్ధీకరించిన యోగాసనాలను  సాధన చేయడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి. 

నార్మల్‌ డెలివరీ.. చురుకైన బిడ్డ!

గర్భధారణ సమయంలో సహజంగానే బరువు పెరుగుతారు. బీపీకూడా పెరుగుతుంది. కానీ, యోగ సాధన చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వివిధ ఆసనాల ద్వారా.. 40 వారాలపాటు శరీరంలో జరిగే మార్పులను తట్టుకునేందుకు అవసరమైన శక్తిని కండరాలు సమకూర్చుకుంటాయి. గర్భంలో పిండం బరువు పెరిగేకొద్దీ, ఆ ప్రభావం వెన్నుపూసపై పడి, వెన్నునొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాళ్లనొప్పులు, వాపులు వస్తుంటాయి. యోగసాధనతో ఇవన్నీ తగ్గిపోతాయి. గర్భంలో ఉన్న శిశువు తొమ్మిది నెలల తర్వాత, సుఖ ప్రసవం ద్వారా బయటికి రావడానికి తగినట్టుగా సర్విక్స్‌ కండరాల పనితీరును యోగా మెరుగుపరుస్తుంది. ప్రాణాయామం వల్ల శరీరానికి అవసరమైన ప్రాణశక్తి అందుతుంది. తద్వారా కండరాలు శక్తిమంతం అవుతాయి. శిశువు శారీరక ఎదుగుదల బాగుంటుంది. చురుకైన బిడ్డ పుట్టడానికి ఇది దోహదం చేస్తుంది. అంతేకాదు, ప్రసూతి నొప్పులను భరించగలిగేలా చేస్తుంది. సిజేరియన్‌ అవసరం లేకుండా.. నార్మల్‌ డెలివరీకి ఉపయోగపడుతుంది. రక్తపోటుకూడా నియంత్రణలో ఉంటుంది.

ఆసనాలే ఆరోగ్య సూత్రాలు

ప్రెగ్నెన్సీ యోగా నిపుణుల దగ్గరే సాధన చేయాలి. మామూలు  ఆసనాలకు భిన్నంగా గర్భిణి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిని బట్టి వివిధ ఆసనాలను డిజైన్‌ చేస్తారు వారు. మార్జాల ఆసనం (శ్వాసతో కూడిన), కోణాసనం 1, కోణాసనం 2, వీరభద్రాసనం, త్రికోణాసనం, విపరీతకరిణి, బద్ధకోణాసనం, శవాసనం లాంటివి ప్రధానమైనవి. అలాగే ప్రాణాయామాల్లో భ్రామరీ, నాడీశోధన, లేబర్‌ బ్రీతింగ్‌ వంటి టెక్నిక్స్‌ బాగా పనిచేస్తాయి. ప్రత్యేకంగా గర్భవతుల కోసం, గర్భస్థ శిశువు కోసం రూపొందించిన యోగనిద్ర కూడా ప్రయోజనకారి.

గైనకాలజిస్టు సలహా తప్పనిసరి

వివిధ దశలలో శరీర స్థితిగతులను గమనించి మాత్రమే గర్భిణులు యోగ సాధన చేయాలి. యోగా ప్రారంభించే ముందు గైనకాలజిస్టును సంప్రదించి, తన ఆరోగ్య పరిస్థితి యోగాకు అనువుగా ఉందో, లేదో పరీక్ష చేయించుకోవాలి. ప్రసవం తరువాత తిరిగి యోగ సాధన మొదలుపెట్టడానికి కూడా డాక్టర్‌ సలహా అవసరమే. ప్రెగ్నెన్సీ యోగా సొంతంగా చేయకూడదు. నిపుణులైన యోగా థెరపిస్టుల పర్యవేక్షణ తప్పనిసరి.

ఆరోగ్యమూ..అందమూ..

గర్భధారణ సమయంలో విపరీతంగా బరువు పెరిగిన శరీరం, ప్రసవానంతరం తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి చాలా కష్టమవుతుంది. శరీర భాగాలన్నీ వదులైపోతాయి. అవి మునుపటి పటుత్వాన్ని సంతరించుకోవడానికి యోగా ఉపయోగ పడుతుంది. అందుకే, రెండో బిడ్డను కంటే అందం పోతుందన్న ఆందోళన ఉంటుంది కొందరిలో. యోగా అటు ఆరోగ్యాన్ని అందిస్తూనే, ఇటు అందాన్ని రక్షిస్తుంది. యోగసాధనలో ఉన్నవారు ప్రసవం తరువాత కూడా నాజూగ్గా తయారవుతారు. 

VIDEOS

logo