e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిందగీ పని కూడా పాఠమే!

పని కూడా పాఠమే!

పేపర్‌ బాయ్‌ శ్రీ ప్రకాశ్‌ తల్లిఅనూష

‘పిల్లలకు పని విలువ తెలియాలి. పని విలువ తెలిస్తేనే జీవితం విలువా తెలుస్తుంది. పని చేయడాన్ని నామోషీగా భావిస్తే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడుతాయి. అందుకే, నా పిల్లలకు శ్రమ విలువ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా’ అంటున్నది జగిత్యాలకు చెందిన పేపర్‌ బాయ్‌ శ్రీ ప్రకాశ్‌ తల్లి బండివార్‌ అనూష. ఆ బాలుడి మాటలు, ఈ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు కూడా. ఈ నేపథ్యంలో శ్రమైకజీవన సౌందర్యం గురించి తన అభిప్రాయాలను‘జిందగీ’ తో పంచుకున్నది అనూష.

- Advertisement -

నేను హైస్కూల్‌లో చదివే రోజుల్లో సైకిల్‌మీద బజారుకెళ్లి సరుకులు తెచ్చేదాన్ని. అమ్మ చెప్పిన పనులన్నీ చక్కబెట్టేదాన్ని. ‘పేపర్‌ వేస్తా, దుకాణం నడుపుతా’ అంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. ‘ఆడపిల్లవు. నీకెందుకు?’ అని వారించేది. పనిచేసేందుకు ఆడా, మగా తేడా ఏమిటో నాకు అర్థం కాకపోయేది. మాది జగిత్యాల. అమ్మ సుమలత బీడీ కార్మికురాలు. నాన్న సత్యనారాయణ సినిమా థియేటర్‌లో మేనేజర్‌. మేం ఇద్దరు ఆడపిల్లలం, ఇద్దరు మగపిల్లలు. మధ్య తరగతి కుటుంబం. ఇంటర్‌ తర్వాత మహారాష్ట్రలోని నాగ్‌భీర్‌ ప్రాంతానికి చెందిన బండివార్‌ ప్రతాప్‌వీర్‌గౌడ్‌తో నా వివాహమైంది. నాగ్‌భీర్‌కు వెళ్లిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మా ఆయన చిన్నవయసులో ఉన్నప్పుడే మా మామ అంజయ్య గౌడ్‌ చనిపోయారు. అప్పటి నుంచి మా అత్తమ్మ అరుణావతి ఇద్దరు కొడుకులను చదివించింది. మా ఆయన వాళ్ల అన్నయ్య పేరు సత్యవీర్‌గౌడ్‌. వార్దాలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆయన చిన్నప్పటి నుంచీ కష్టపడి చదువుకున్నారట. మా ఆయన కూడా ఏదో ఒక పనిచేస్తూనే చదువుకొన్నాడని మా అత్తమ్మ చెప్పింది.

పిల్లల చదువుల కోసం..
నాగ్‌భీర్‌ గిరిజన ప్రాంతం. అక్కడ పెద్దగా వసతుల్లేవు. పిల్లల చదువుల కోసం జగిత్యాలకు మారాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడికొచ్చాక ఆయన కొన్నాళ్లు కారు డ్రైవర్‌గా చేశారు. తర్వాత, సొంతంగా వాహనం కొన్నారు. నేను బొటిక్‌ నిర్వహిస్తున్నా. ఇద్దరు పిల్లలనూ మా ఇంటికి సమీపంలోని ప్రైవేట్‌ స్కూల్లో చేర్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీలో ప్రాధాన్యం ఇస్తారని నా పెద్ద కొడుకు సాయికృష్ణ చెప్పేవాడు. వాడి ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలని సర్కారు బడిలో చేర్పించాను. నిజంగానే, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బాగుంటుందని తెలిసిపోయింది. తమ్ముడు శ్రీప్రకాశ్‌ను కూడా తమ బడికే పంపమని సాయి వెంటపడ్డాడు. ఈసారి కాదనడానికి కారణం కనిపించలేదు. సాయికృష్ణకు ఎనిమిదో తరగతిలోనే సైకిల్‌ కొనిచ్చాం. రోజూ తెల్లవారుజామునే లేచి ఊర్లో రౌండ్లు కొట్టేవాడు. పేపర్‌ వేసే వాళ్లను గమనించేవాడు.

ఓరోజు ‘అమ్మా! నేనూ పేపర్‌ వేస్తా’ అని అడిగాడు. మొదట్లో తటపటాయించాను. అయినా, శ్రమ విలువ తెలుస్తుంది. శారీరక వ్యాయామం అవుతుంది. పాకెట్‌ మనీ సంపాదించుకున్న తృప్తి కూడా ఉంటుందనే ఉద్దేశంతో సరేనన్నాను. రెండేండ్ల నుంచీ వాడు పేపర్‌ బాయ్‌గా చేస్తున్నాడు. ఆరో తరగతి చదువుతున్న శ్రీప్రకాశ్‌ ఏడాది కాలంగా పేపర్‌ వేస్తున్నాడు. ఇదంతా చూసి బంధువులు సూటిపోటి మాటలన్నారు. ‘పిల్లలతో పనిచేయించడం ఏమిటి? అవసరమైతే ఒకపూట తినండి’ అంటూ దెప్పి పొడిచారు. అయితే, ఇక్కడ విషయం సంపాదన కాదు. పిల్లలకు డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ తెలియజేయాలన్నదే మా ఆలోచన. శ్రమ వల్ల మానసిక ఎదుగుదల, సమాజం పట్ల అవగాహన, వృత్తిలో నిబద్ధత పిల్లలకు అలవాటు అవుతాయి. అందుకే, నా బిడ్డే కాదు ఏ బిడ్డ పనిచేసినా సంతోషిస్తా.

… కొత్తూరు మహేశ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement