గురువారం 21 జనవరి 2021
Zindagi - Nov 28, 2020 , 00:09:58

కుటుంబ వ్యాపారంలో.. మహారాజ్ఞి!

కుటుంబ వ్యాపారంలో.. మహారాజ్ఞి!

కుటుంబ వ్యవహారాల్లో మహిళ జోక్యం చేసుకుంటే ఇంటాయన పెదవి విరిచేవాడు. ఇక ఆర్థిక లావాదేవీలు ఆమెకు సంబంధం లేదన్నట్టుగా భావించేవారు. కానీ, మనసుతో ఆలోచించే తమకు అవకాశం ఇస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. కుటుంబ వ్యాపారాల్లో భాగమవుతూ సత్తా చాటుతున్నారు. ఏకంగా అధినాయికలై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్‌ కన్సార్టియమ్‌, కేపీజీఎమ్‌ ప్రైవేట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం తేటతెల్లం అయింది. దాదాపు 33 దేశాల్లో 1800 వ్యాపార కుటుంబాలను ప్రశ్నించారు. మనదేశంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో 53 కంపెనీల్లో సర్వే చేశారు. ఆయా దేశాల్లో కుటుంబ వ్యాపారాలను 18 శాతం మహిళలే నిర్వహిస్తున్నారని ఇందులో తేలింది. యూరప్‌, మధ్య ఆసియా దేశాల్లో ఫ్యామిలీ బిజినెస్‌లో మహిళల ఆధిపత్యం నానాటికీ పెరుగుతున్నదని సర్వేకారులు చెబుతున్నారు. స్టీలు, సిమెంట్‌, హార్డ్‌వేర్‌, మైనింగ్‌ తదితర పురుషాధిక్య రంగాల్లోనూ మగువలు పట్టు సాధిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా.. మిలీనియల్స్‌ జమానా మొదలైన నాటి నుంచి ఫ్యామిలీ బిజినెస్‌లో మగువలకు అవకాశాలు పెరుగుతుండటం విశేషం. ఈ కాలానికి ప్రతినిధులైన యువతులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహాన్నీ అందుకుంటున్నారు. బాసిజానికి స్వస్తి పలుకుతూ ఉద్యోగులతో కలిసిపోతున్నారు. ఇతర సంస్థలతోనూ చక్కటి సంబంధాలు నెరపుతూ మెరుపులా మెరిసిపోతున్నారు.logo