శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Zindagi - Jul 02, 2020 , 23:31:45

రైటింగ్‌తో.. కొత్త ఎనర్జీ!

రైటింగ్‌తో.. కొత్త ఎనర్జీ!

‘హిప్పీ’ సినిమాతో తెరవిందు చేసిన దిగంగనా సూర్యవంశి  నవతరానికి ప్రతినిధి. ఆమె ఆలోచనలూ అభిప్రాయాలూ  కొత్తతరం ఆకాంక్షల్ని వ్యక్తం చేస్తాయి. తను గోపీచంద్‌ సరసన నటించిన ‘సీటీమార్‌' విడుదలకు సిద్ధం అవుతున్నది.  లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో.. ప్రస్తుతం తను, ముంబైలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నది. తెలుగు సినిమాల మీద ప్రేమ ఆమె మాటల్లో వ్యక్తం అవుతున్నది.. 

దిగంగనా సూర్యవంశి... చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. చాలాకాలం హిందీ సీరియల్స్‌తో బిజీగా గడిపింది.  2018లో  పెద్ద తెర మీదికి వచ్చింది. కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. ‘హిప్పీ’తో తెలుగులో అడుగుపెట్టింది.  హిందీ బిగ్‌బాస్‌-9లోనూ పాల్గొన్నది. 

లాక్‌డౌన్‌కు ముందు: ‘లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు చాలా హడావుడిగా ఉన్నాను. హిందీ మూవీ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రావడానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్‌ చేస్తున్నా. ఇంకా, బోర్డింగ్‌ పాస్‌ తీసుకోవాల్సి ఉంది. అప్పుడే ఓ కాల్‌ వచ్చింది. షూటింగ్‌ నిలిచిపోయినట్టు చెప్పారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఇంటికి వచ్చేశాను. 

లాక్‌డౌన్‌లో : లాక్‌డౌన్‌ నాకు ఓపికగా ఉండటం ఎలాగో నేర్పింది. నాకు పెయింటింగ్స్‌ అంటే ఇష్టం. అప్పుడప్పుడూ బొమ్మలు గీస్తున్నాను. పుస్తక పఠనం, వర్కౌట్లు మామూలే. మొదటి నుంచీ మనసులోని భావాల్ని కాగితం మీద పెట్టడం అలవాటు. రైటింగ్‌ కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఈ రెండుమూడు నెలల్లో చాలానే రాశాను. మిగతా సమయంలో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాను. సాయంత్రాలు మాత్రం టెర్రస్‌ మీదే కాలక్షేపం. పిచ్చుకలు వస్తుంటాయి. వాటితో కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటాను. అతిథులకు భోజనం పెట్టడం మన సంప్రదాయం కదా! ఆ చిట్టి చుట్టాలకు గింజలు వేస్తాను. 

సీటీమార్‌ రోల్‌: సీటీమార్‌లో నా పాత్రని తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. గోపీచంద్‌ పక్కన నటించడం అంటే నమ్మలేకపోతున్నాను. సినిమాలో టీవీ రిపోర్టర్‌ పాత్ర. చాలా ధైర్యవంతురాల్ని అన్నమాట. షూటింగ్‌ చాలా సరదాగా గడిచిపోయింది. నిజం చెప్పాలంటే.. లాక్‌డౌన్‌లో మొదటి రోజు ఏం చేయాలో తోచలేదు. కరోనా అన్ని షెడ్యూల్స్‌నూ డిస్ట్రబ్‌ చేసింది. సీటీమార్‌తో పాటు ఓ హిందీ మూవీ  షూటింగ్‌ మధ్యలో ఆగిపోయింది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. అందుకేనేమో, చాలా తక్కువ సమయంలోనే తెలుగు అలవాటైంది. పూర్తిగా మాట్లాడలేకపోయినా అర్థం చేసుకోగలను. తెలుగువాళ్లతో పని చేయడం బాగుంది. లాక్‌డౌన్‌ అవగానే హైదరాబాద్‌ వచ్చేస్తాను. అప్పటివరకూ.. సెలవ్‌! విత్‌ లవ్‌.. దిగంగనా సూర్యవంశి. 


logo