e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిందగీ ఏది చెప్పినా మంచికే!

ఏది చెప్పినా మంచికే!

ఇల్లు తీరు వాకిలుంటది.  తల్లి తీరు పిల్లలుంటరు.  మనంజేసే పనులన్నీ వాళ్లు చూస్తుంటరు. మన లెక్క చెయ్యాలె అనుకుంటరు. మరి, వాళ్లంతట వాళ్లే తెలివికొస్తరా? తల్లిదండ్రుల అనుభవమూ  తోడైతదా అన్నది తెలుసుకునేందుకు ‘గంగవ్వ యాది’లోకి వెళ్లొద్దాం! 

మేం చిన్నప్పటికెల్లి కాయకష్టం చేస్కుంట బతికినం. నా పేరు నర్మాల గంగవ్వ. మా తల్లిగారి ఊరు సిరిసిల్ల దగ్గర గూడెం. నేను తొమ్మిదేండ్ల పిల్లనున్నప్పుడు పెండ్లయింది. అత్తగారి ఊరు దుబ్బాక దగ్గర దుంపలపల్లి. మా ఆయన పేరు కిష్టయ్య. పిల్లలు కాంగనే కన్నారం వచ్చేసినం. 

 బొంబాయి పొయిండు 

మా ఆయన కష్టవోతు కిష్టయ్యనే. ఇగురంగల్లోడే. కానీ, కోపానికస్తే ఆగడు. ఆ కోపమే మాకు కొన్నొద్దులు కష్టాలు తీసుకొచ్చింది. ఒక పని నిక్రంగా చేయకపోవుడుతోటే సమస్యొచ్చేది. కోపిష్టేగనీ మల్ల వెంటనే నిమ్మళమైతడు. మేం ఎవలమన్నా అలిగి తినకపోతే తిన్నదాకా ఇడిశేటోడు కాదు. మాకు నలుగురు కొడుకులు. కనంగ, పెంచంగనే సక్కదనం కాదు కదా. వాళ్లకు ఏ సమస్య రాకుంట చూసుకోవాలె. మా కిష్టయ్య ఒకరోజు చెప్పకుండ చెయ్యకుండాబొంబాయి పొయిండు. ఊరుగాని ఊళ్లెవోయి పనిజేసుడెందుకు? ఎవుసం చేసుకుంట ఉండూళ్లనే ఉంటెగాదా? అని తలా ఓ మాటన్నరు. నాగ్గూడా అనిపించింది. మమ్ములను వదిలేసి ఎక్కడో ఉండుడెందుకని. 

దేవునికి మొక్కిన 

ఏం తింటుండో? ఏడ ఉంటుండో? ఎవ్వరికీ తెల్వదాయె. అప్పుడు ఇప్పట్లెక్క గీ ఫోన్లెక్కడివి? గీ కతెక్కడది? బొంబాయి నుంచి గిట్లే ఊరోళ్లెవరైనా వస్తే వాళ్లతోటి చెప్పంపుదుము. శానా రోజులైతాంది. ఇగ రాడు అగ రాడు. చూసీ చూసీ నన్ను, పిల్లల్ని మా అమ్మోళ్లు పుట్టింటికి తీస్కపోయిండ్రు. ‘పిల్లలాగమయ్యె కాలమొచ్చెగారా దేవుడా’ అనుకున్నా. ‘వస్తే వచ్చె, లేకపోతే లేదు. నేనైతే నా పిల్లలను మంచిగ చూసుకోవాలె’ అనిపించింది. ఇగ మేం విడిపోయినట్టే అనుకున్నరంతా. నేను బాధపడుతున్ననని మా అన్నల్దమ్ములు బొంబాయి పొయ్యి దొర్కవట్టి ఊరికి తీసుకొచ్చిండ్రు. ఊళ్లె ఉండలేనని ఉన్న భూమిని అమ్మేసి కన్నారం వచ్చినం. కన్నారం వచ్చినంక నిమ్మళమైండు. మొదాలు సుతారి పనికి పోతుండె. నేను కూడా ఇంట్లె ఊకెనే ఉండకుండా కలుపు, నాట్లకు పోతుంటి. 

కాళ్లు కడిగి పెండ్లి చేసినం 

పిలగాళ్ల సదువులు విషయంల అయితే మా కిష్టయ్యను మెచ్చుకోవచ్చు. ఆయన గూడ ఏడు వరకు సదివిండు. కొడుకులను మంచిగ సదివించాలెనని హాస్టళ్ల ఏసిండు. సుతారి పని చాతగాక కన్నారంలనే ‘పాన్‌ టేల’ పెట్టిండు. మా కష్టాన్ని చూసుకుంట పెరిగిండ్రు మా పిల్లలు. వారికి ఎప్పుడు ఏంగావాల్నో అది చేసినం. వాళ్లు కూడా దేనికీ మంకు చేయలేదు. కష్టపడి చదివిండ్రు. ఇప్పుడు మంచి కొలువులు చేస్తుండ్రు. నాకు మనుమలు, మనుమరాండ్లు ఎనుమండుగురు. మా కిష్టయ్య పదిహేనేండ్ల కిందనే జరిగిపోయిండు. ఆడబిడ్డెల్లేరని మా అక్క బిడ్డకు కాళ్లు కడిగి కన్యాదానం చేసినం. సొంత బిడ్డ లెక్కనే చూసుకున్నం. కానీ, దానికి లేనిలేని రోగాలు వచ్చి జరిగిపోయింది. అన్నలకు రాకీలు కట్టెనీకె యాడాదికోసారి వచ్చేది. చిన్నప్పటి సంది మా పిల్లలు ఎట్ల చెప్తే అట్ల వినేటోళ్లు. ఈ కాలం పిల్లలు ఎవరింటున్నరు? తల్లిదండ్రులు ఏది చెప్పినా అనుభవంతోటే చెప్తరు కదా? ఏది చెప్పినా మంచి కోసమే కదా?

దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏది చెప్పినా మంచికే!

ట్రెండింగ్‌

Advertisement