ప్రస్తుతం, నేను రెండు నెలల గర్భిణిని. అయితే, వారం రోజుల నుంచీ విపరీతంగా వాంతులు అవుతున్నాయి. రోజంతా వాంతి వచ్చినట్లే అనిపిస్తుంది. ఏం తిన్నా వెంటనే బయటికి వచ్చేస్తుంది. ఇంట్లోవాళ్లేమో గర్భంతో ఉన్నప్పుడు ఇదంతా సాధారణమేనని అంటున్నారు. తిన్న కొద్దిపాటి ఆహారం కూడా వాంతి అవుతుంటే, కడుపులో బిడ్డ ఆరోగ్యం దెబ్బ తింటుందేమో అని నా భయం. ఇంట్లోవాళ్ల మాటే నిజమైతే, వాంతులు ఎన్నిరోజుల వరకూ వస్తుంటాయి. దీనివల్ల సమస్యలు ఉంటాయా? ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దవాఖానకు వెళ్లాలి? –ఓ సోదరి
జ : గర్భధారణ సమయంలో 90 శాతం మందికి వాంతులు సహజమే. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ, మిగతా పదిశాతం మందిలో మాత్రం తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. కొన్ని రకాల హార్మోన్లు అసాధారణ స్థాయిలో విడుదలయ్యే వారిలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలైనా, ఇమ్యూనిటీ సమస్యలు ఉన్నా ఇలాంటి ఇబ్బంది వస్తుంది. అంతేకాకుండా, ఒకటి కంటే ఎక్కువ పిండాలతో గర్భం దాల్చిన పరిస్థితిలో కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు మహిళలు బరువు తగ్గిపోతారు. శరీరంలో నీటిశాతం పలుచబడుతుంది. పెదాలు పొడిబారతాయి. కళ్ల కింద గుంతలు పడుతాయి. నీరసంగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతారు. కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతారు. ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైతే మూడు నాలుగు రోజులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. సకాలంలో సరైన వైద్యం అందితే, తల్లీబిడ్డలకు ఏ సమస్యా ఉండదు.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ