క్యాన్సర్ మహమ్మారి తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి రోగ నిర్ధారణ జరిగాక చేసేదేమీ ఉండదు కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని క్యాన్సర్లకు నివారణ మార్గాలుండవు. కానీ, పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటిని ముందుగానే నివారించవచ్చు. గత మూడు దశాబ్దాల నుంచీ యాభై ఏండ్లలోపు వాళ్లలో పెద్దపేగు క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నదని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెబుతున్నది.
ఈరకం క్యాన్సర్‌ను విటమిన్-డి నివారిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పైగా, విటమిన్-డి ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేం కాదు. కృతకమైన సప్లిమెంట్లకంటే విటమిన్-డి పుష్కలంగా లభించే డెయిరీ ఉత్పత్తులను వాడటమే మేలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే, ఉదయం కొంతసేపు సూర్యరశ్మిలో కూర్చోవాలని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్టయితే, మిగిలినవారు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని హెచ్చరిస్తున్నారు.