బుధవారం 27 జనవరి 2021
Zindagi - Dec 04, 2020 , 00:21:45

ఇంకి.. పింకి.. ఫంకీ!

ఇంకి.. పింకి.. ఫంకీ!

కాలేజీ రోజుల్లో.. టీనేజీ పోజుల్లో ఫంకీలది ప్రత్యేకమైన మార్కు. చంకీ మెటల్స్‌, పూసల గాజులు, స్టెప్స్‌ చెయిన్‌, డెనిమ్‌ డ్రెస్‌, హెయిర్‌ క్లిప్‌, మెటల్‌ రింగ్స్‌.. చెప్తూ పోతే ప్రతి అతివా తనను తాను అతిలోకసుందరిగా ఊహించుకునేలా చేసేవి ఫంకీ మోడల్స్‌. దశాబ్దానికి ఒకసారి కొత్త రూపుదిద్దుకొని, కాలానికి తగ్గట్టుగా నయా ట్రెండ్స్‌ను కలుపుకొని మరింత అందంగా ముస్తాబవుతుంటాయివి. కాలేజీ దాటొచ్చిన వారికి మళ్లీ ఆ పాత రోజులను జ్ఞప్తికి తెస్తూ తమలో తాము మురిసిపోయేలా చేస్తుంటాయి.

అందాన్ని మెలి తిప్పండి

త్రెడ్‌ జ్యుయెలరీకి ఆధునిక మగువల్లో ఆదరణ ఎక్కువే. లాంగ్‌ స్కర్ట్‌లు, పొడవాటి గౌన్‌ వంటివాటి మీదకు ఇవి బాగుంటాయి. కాస్త కొత్తగా కనిపించాలంటే కొన్నిసార్లు మెడలో గొలుసు వేసుకోకపోయినా, చెవికి స్టడ్స్‌, చేతికి పెద్ద డయల్‌తో స్టేట్‌మెంట్‌ వాచ్‌ పెట్టుకుంటే చాలు స్టయిలిష్‌గా కనిపిస్తారు. అలానే చంకీ బెల్ట్‌, స్కార్ఫ్‌, స్లింగ్‌ బ్యాగ్‌, పౌచ్‌ వంటివన్నీ సందర్భాన్ని బట్టి ఎంచుకోగలిగితే సింపుల్‌ లుక్‌తోనే ట్రెండీగా కనిపించొచ్చు.

వెండి మెరుపులు

బంగారం, ప్లాటినం నగలు మార్కెట్‌లో ఎన్నున్నా.. వెండి ట్రెండింగ్‌లో ఉంది. కొత్తలుక్‌ని తెచ్చిపెట్టడంలో సిల్వర్‌ ఆభరణాల ప్రత్యేకతే వేరు. జుంకాలు, చెవి దుద్దులు, ఫంకీ పెండెంట్‌లతో కూడిన గొలుసులకు ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటున్నది. రకరకాల ఆకృతుల్లో టైనీస్టడ్స్‌ లభిస్తున్నాయి. వీటిని క్యాజువల్‌గా జీన్స్‌-టాప్‌, కుర్తీ-లెగ్గింగ్‌ల మీదికి ఎంచుకోవచ్చు. వెండి, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌తో తయారైన జుంకాలు, జ్యూతీలను రిప్డ్‌ జీన్స్‌కు జతగా ఎంచుకుంటే లుక్‌ అదిరిపోతుంది. సిల్వర్‌ నెక్లెస్‌ను స్పాగెట్టీ మీదకు వేసుకోవచ్చు. దీనికి జతగా బ్లాక్‌హీల్స్‌ ఉండేలా చూసుకోవాలి.

గిరిదాటిన సొగసులు

ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన ఆభరణాలు ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించి ఫ్యాషన్‌ తీరునే మార్చేశాయి. లెదర్‌, సిల్క్‌, బీడ్స్‌, క్రిస్టల్స్‌తో తయారైన ట్రైబల్‌ జ్యుయెలరీకి విపరీతమైన ఆదరణ ఉన్నది. వీటిలో ఉపయోగించే పింక్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ వంటి టెక్నో కలర్స్‌ పూసలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. గిరికాంతల ఆభరణాలకు కొత్త కాంతులు జత చేసి ఫ్యాషన్‌కు చిరునామాగా మార్చేస్తున్నారు. సంప్రదాయానికి భిన్నమైన అభిరుచి ఉన్నవారి కోసం డేంజర్‌ సింబల్స్‌లోనూ జ్యుయెలరీని రూపొందిస్తున్నారు. మొత్తానికి ట్రెండీగా ఉండాలనుకునే యువతులకు ఇవి బాగా నప్పుతాయి.

లేయర్స్‌గా..

లేయర్స్‌గా నెక్లెస్‌ వేసుకుంటే ఆ అందమే వేరు. ఇందులో మెటల్‌ బిబ్‌ నెక్లెస్‌ చాలా బాగుంటుంది. రెండు భిన్నమైన లేయర్స్‌తో ఆభరణాలకు డిఫరెంట్‌ లుక్‌ తెస్తున్నారు డిజైనర్లు. ముత్యాలతో తయారైన కలర్‌ బీడ్స్‌, సిరామిక్‌ పువ్వులతో కలిపి తీర్చిదిద్దుతున్నారు. 

రంగురాళ్లతో..

గోల్డ్‌ ఎల్లో, వైట్‌, పింక్‌, బ్లాక్‌ స్టీల్‌, కాపర్‌.. ఇలా అనేక రంగుల్లో మెటల్స్‌ వయ్యారాలు పోతున్నాయి. మెలితిరిగి మురిపిస్తున్నాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారైన చెయిన్స్‌, బ్రేస్‌లెట్లకు నడివయసు వారు సైతం ఓటేస్తున్నారు. వీటిల్లోనూ సింగిల్‌, డబుల్‌ థిన్‌ అండ్‌ థిక్‌ డిజైన్లలో రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి పెద్ద పెద్ద స్టోన్స్‌ తోడైతే ఆ అందమే వేరని అంటున్నారు డిజైనర్లు. ముందుగా మెటల్‌ని ఎంపిక చేసుకుని వాటికి తగిన విధంగా ముత్యాలు, డైమండ్స్‌, క్రిస్టల్స్‌, విలువైన రంగురాళ్లను జత చేస్తున్నారు.logo